హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘మీ సమస్యలపై మాకు సంపూర్ణ అవగాహన ఉన్నది. ప్రభుత్వం అనుకుంటే గంటలో మీ సమస్యలు పరిష్కారమైతయి. మిమ్మల్ని సచివాలయం లో కూర్చోబెట్టి మీరు చాయ్ తాగేలోపల జీవో ఇవ్వవచ్చు. మేం అధికారంలోకి రాగానే మీ సంఘాల నాయకులను సచివాలయానికి పిలిపించి సమస్యలను పరిష్కరిస్తాం’. ఇదీ ఎన్నికల సమయంలో హనుమకొండలో నిర్వహించిన ఎస్ఎస్ఏ ఉద్యోగుల ధర్నాలో రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎస్ఎస్ఏ ఉద్యోగులను సచివాలయానికి పిలిచింది లేదు.. సమస్యలను పరిష్కరించింది లేదు.
దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 25 రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాపార్క్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత సమ్మె నోటీసులు అందజేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగా రు. సమ్మె ఆరు రోజులుగా కొనసాగుతున్నది. డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీ యాదగిరి, జీ ఝాన్సీసౌజన్య ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిషరిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఏడాదిగా హామీ నెరవేరుతుందని ఎదురుచూశాం. కానీ, మాకు నిరాశే మిగిలింది. దీంతో మళ్లీ రోడ్డునపడ్డాం. ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– ఎస్ వీణ, ప్రత్యేకాధికారి, నర్సాపూర్, నిర్మల్
మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసింది. వంద రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చి ఏడాది గడిచినా పట్టించుకోవట్లేదు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించం. 20 వేల కుటుంబాలు రోడ్డు మీదికి వచ్చాయి. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి.
– పడాల రవీందర్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధికార ప్రతినిధి