Revanth Reddy | హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ అనే థీమ్‌తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు వేదికగా ఆయన ప్రయత్నించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ద్వారా వచ్చిన దాదాపు 5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను, అలాగే గత రెండు దావోస్ పర్యటనల ఒప్పందాలను శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిషరించి, ఆ పెట్టుబడులు త్వరగా కార్యరూపం దాల్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ టూర్ ఉండనున్నదని తెలిపారు.