CM Revanth Reddy | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నదని నిపుణులు, నెటిజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆడిందే ‘ఆట’గా నడుస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్రకుమార్‌నాయక్ తండ్రి రమావత్ కనీలాల్నాయక్ మరణించారు. ఆదివారం దేవరకొండలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. కానీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదంటూ కలెక్టర్ అనుమతించలేదు. దీంతో కేసీఆర్ పర్యటన రద్దయ్యింది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీలో ఫుట్‌బాల్ ఆడారు. ఈ మ్యాచ్ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నారు. మ్యాచ్ మామూలుగా ఆడితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. ఆ గ్రౌండ్ చుట్టూ బౌండరీ లైన్‌గా కాంగ్రెస్‌ను గుర్తు తెచ్చేలా మూడు రంగుల పరదాను ఐదు అడుగుల ఎత్తు మేర కట్టారు. ఇలా పరదాలు కట్టడం, కాంగ్రెస్ నాయకులు ఆడటం, దానిని వీడియో తీసి విడుదల చేయడం కచ్చితంగా ఎన్నికల ప్రచారమే అన్నది నిపుణుల మాట.
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, టెమ్రిస్ ప్రెసిడెంట్ ఫహీంఖురేషి, హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ నాయకులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ జట్టుకు కాంగ్రెస్ కూటమి పేరును స్ఫురించేలా ‘ఇండియా టీమ్’ అని పేరుపెట్టారు. టీషర్టులపై ఆ పేరు రాయడంతోపాటు షర్టు చివర్లోనూ మూడు రంగుల స్ట్రిప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాచ్‌ను చూసేందుకు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హరర వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీ శాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ను స్ఫూరించే జెండాలు కట్టి.. ఆ పార్టీ నాయకులు ఆడిన మ్యాచ్ ఎన్నికల ప్రచారం కాదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న అంశాలకే సుమోటోగా తీసుకొని నోటీసులు ఇచ్చే ఎన్నికల సంఘానికి ఈ తతంగం కనిపించలేదా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పైగా.. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు తరచూ ఫుట్‌బాల్ అడుతుంటారు కాబట్టి ఆదివారం ఆటవిడుపుగా ఆడారనుకొనే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఫుట్‌బాల్ ఆడిన దాఖలాలు లేవని అంటున్నారు.ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై 48 గంటలు ప్రచారం చేయకుండా నిషేధం విధించడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి పరుష పదజాలం వాడినా, ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోలేదని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ప్రవర్తిస్తున్నదని పార్టీ సహచరుడి తండ్రి మరణిస్తే మానవీయ కోణంలో పరామర్శించేదుకు వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ జెండాలతో ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.