ఖైరతాబాద్, నవంబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల సంక్షేమానికి పాటుపడుతామని హామీ ఇచ్చి విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డి తమను మోసగించారని యాదవ హక్కుల పోరాట సమితి (వైహెచ్పీఎస్) జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదవులకు మంత్రి పదవితోపాటు సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి సంవత్సరం కావస్తున్నా.. ఇప్పటి వరకు యాదవులకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన 31 కార్పొరేషన్లలో యాదవులకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. యాదవులకు మంత్రి పదవి, మూడు ఎమ్మెల్సీలు, ఐదు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని, 20 రోజుల్లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి వంశీమోహన్ యాదవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్, వెంకట్రాం నర్సయ్య, గంగుల ఐలేశ్యాదవ్, రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.