హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగ అలైన్మెంట్లో మరిన్ని మార్పులను సూచించారు. వాటికి అనుగుణంగా మార్పులు చేసి తుదిరూపునిస్తే కార్యాచరణ ప్రారంభించవచ్చని చెప్పారు. ఈమేరకు బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీపోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఫోర్త్ సిటీ అభివృద్ధికి అనుగుణంగా అలైన్మెంట్ ఉండాలని సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించే రేడియల్ రోడ్ల భూ సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు.
డ్రైపోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. రైలు, జల మార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్పైనా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ, సేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓఆర్ఆర్ -ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించే రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఫోర్త్ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందంటూ అమెరికాలోని యాపిల్ పార్క్‌ను ఉదహరించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాస రాజు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.