హైదరాబాద్, జూన్18 (నమస్తే తెలంగాణ): విధాన నిర్ణయాలు, సాధారణ పరిపాలనలో ఒంటెత్తు పోకడలు ప్రభుత్వానికి, పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని ముఖ్యమంత్రికి సీనియర్ మంత్రులు హితవు పలికినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి 30 నెలల కాలం ముగిసిందని, కానీ, ఇప్పటికీ మంత్రివర్గం ఇంకా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుందని, ఎటు గాలి వస్తే అటే అడుగులు వేస్తామనే పద్ధతి మంచి కాదని సీనియర్ మంత్రులు చెప్పినట్టు తెలిసింది. ‘ప్రభుత్వం నడిపే పెద్దగా మీరు తీసుకున్న అనూహ్య నిర్ణయాలు, గందరగోళ ఆలోచనతో అందరం ఇబ్బందులు పడుతున్నాం’ అని మంత్రులు సూటిగా ముఖ్యమంత్రికి చెప్పినట్టు తెలిసింది.
గురువారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ముందుగా ఈ-క్యాబినెట్ విధానంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ‘మా మాటకు విలువేది? రగులుతున్న మంత్రులు’ అన్న పతాక శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచరితమైన కథనంతో ముఖ్యమంత్రి అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకొన్నట్టు తెలిసింది. క్యాబినెట్ భేటీలో వాగ్వాదం జరిగే అవకాశం ఉన్నదనే అంచనాతో.. అధికారిక క్యాబినెట్ భేటీని అనధికారిక సమావేశంగా మార్చినట్టు తెలిసింది. బ్యూరోక్రాట్లను, శాఖల హెచ్వోడీలను ఈ భేటీకి రావొద్దని ఆదేశించినట్టు తెలిసింది. కేవలం చీఫ్ సెక్రటరీ మాత్రమే ఈ సమావేశానికి హాజరైనట్టు తెలిసింది.
జీఏడీ నుంచి ఎజెండా లేదు.. మినిట్స్ నమోదు చేయలేదు!
సాధారణ మంత్రివర్గ సమావేశాలు జరిగేటప్పుడు.. ఏయే అంశాలపై చర్చించాలనే విషయాలపై సాధారణ పరిపాలన శాఖ ముందే ఒక అధికారిక ఎజెండాను సిద్ధం చేసి మంత్రులకు పంపుతుంది. ఈ ఇన్ఫార్మల్ భేటీకి సంబంధించి ఎలాంటి ఎజెండాను జీఏడీ రూపొందించకపోగా మంత్రులకూ ఎలాంటి నోట్స్ పంపలేదు. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ కూడా నమోదు చేయలేదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎలాంటి అధికారిక నిబంధనల పట్టింపులు లేకుండా, కేవలం అనధికారిక భేటీ మాత్రమేనని, స్వేచ్ఛాయుత వాతావరణంలో మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోవడానికే సీఎం ఈ వినూత్న నిర్ణయం తీసుకొన్నట్టు సీఎంవో కార్యాలయం లీకులిచ్చింది. మంత్రులు తీరా అక్కడికి వెళ్లాక క్యాబినెట్ భేటీలో ముందుగా డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలిసింది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మంత్రి శ్రీధర్‌బాబు స్పెషల్ ట్యాబ్‌లను అందజేసినట్టు సమాచారం. అనధికారిక క్యాబినెట్ అని చెప్పిన ముఖ్యమంత్రి… క్యాబినెట్ భేటీలో మాత్రం అధికారిక నిర్ణయాలు ప్రకటించినట్టు తెలిసింది.

ఎందుకీ గందరగోళ నిర్ణయాలు
గందరగోళ, అస్పష్టమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని సీనియర్ మంత్రి ఒకరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘నెలకు రెండుసార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించినం.. గత కొంతకాలం నుంచి అమలు చేస్తూ ఉన్నం.. కానీ ఉన్నట్టుండి ఈ అనధికార క్యాబినెట్ ప్రకటన ఎందుకు చేసినట్టు’ అని నిలదీసినట్టు సమాచారం. ‘విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో, వాటిని ప్రకటించే సందర్భంలో మంత్రులుగా మాకు కనీస సమాచారం మీ నుంచి కానీ, సంబంధింత శాఖల హెడ్స్ నుంచి అధికారిక సమాచారం ఉండటం లేదు’ అని ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన మరో మంత్రి కల్పించుకొని నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఉత్తర తెలంగాణ జిల్లాకే చెందిన మరో మంత్రి కల్పించుకొని ఒక ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని చెప్పుకొంటూ, మరోవైపు ట్యాబ్‌లు, సాఫ్ట్వేర్ అని రూ.4-5 కోట్లు ఖర్చు చేశామని ప్రతిపక్షాలకు మనమే అస్త్రం అందించినట్టు అయిందని అన్నట్టు తెలిసింది. మంత్రివర్గంలో తీసుకొన్న నిర్ణయాలు, సమావేశం ముందు పెట్టిన సాధికారత పత్రాలు ప్రతిపక్ష నేతలకు, నమస్తే తెలంగాణ లాంటి పత్రికలకు చేరవేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమను మరింత అవమానాల పాలు, అనుమానాల పాలు చేసేందుకే ఎవరికీ చెప్పకుండా ఈ క్యాబినెట్ పెట్టినట్టు ఉన్నదని ముఖ్యమంత్రిని సదరు మంత్రి గట్టిగానే అరుసుకున్నట్టు తెలిసింది.
మీనాక్షికి న్యాయం చేద్దాం
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షీనటరాజన్ మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ తిరసరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత తెలంగాణపై ఉన్నదని సీనియర్ మంత్రి ఒకరు అన్నట్టు తెలిసింది. దీనికి మంత్రివర్గం అంతా అంగీకరించినట్టు తెలిసింది. కేంద్రప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో చట్టసభల్లో మీనాక్షి లాంటి గాంధేయవాది గొంతు వినిపించడం అవసరమని క్యాబినెట్లో ఏకాభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఆమెపై జరిగిన కుట్ర కోణాలు, భవిష్యత్తులో ఎలా న్యాయం చేయాలనే అంశంపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. తెలంగాణ నుంచి ఆమెను రాజ్యసభకు పంపాలనే చర్చ జరిగింది. ఎవరిని రాజీనామా చేయించాలనే చర్చ దాక ఇంకా పోనట్టు సమాచారం.
మీ నియోజకవర్గాలను కూడా కాపాడుకోలేరు
మంత్రులు అడిగిన ప్రశ్నలపై ముఖ్యమంత్రి కూడా దీటుగానే బదులిచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం అంటే తానొక్కడిని మాత్రమే కాదని, తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మంత్రులందరిపై కూడా చేస్తున్నట్టేనని అన్నట్టు తెలిసింది. 30 నెలలుగా గమనిస్తున్నానని, తనపై వచ్చిన ఆరోపణల పట్ల మంత్రులుగా మీరెందుకు స్పందించడం లేదని, ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కొందరు మంత్రులు అంటీముట్టనట్టు ఉండటంతోనే ఆశించిన ఫలితాలు రాలేదని తేల్చిచెప్పారు.
‘నాపై కోపంతో ఇలాగే వ్యవహరిస్తే.. కనీసం మీ నియోజకవర్గాలను కూడా మీరు కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది’ అని ముఖ్యమంత్రి హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో దక్షిణ తెలంగాణకు చెందిన ఒక మంత్రి స్పందిస్తూ.. ‘మీరు ఒంటెత్తు పోకడలతో తీసుకొంటున్న నిర్ణయాలే ఈ గందరగోళానికి కారణమని, సీనియర్లమంతా పార్టీకి కట్టుబడి ఉన్నమని, పార్టీకి, ప్రజలకు మేము జవాబుదారులమని, కానీ ప్రభుత్వ కార్యక్రమాలు, విధానపరమైన నిర్ణయాలు కొన్ని పత్రికల్లో వచ్చిన తర్వాతే మాకు తెలుస్తున్నాయి’ అని చెప్పినట్టు తెలిసింది.