నెల్లికుదురు, ఏప్రిల్ 22 : తెలంగాణలో బీడువారిన లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రాత్మకమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లాని ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు గోదావరి పాలయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన నిరసించారు.
మేడిగడ్డ బరాజ్‌లో రేవంత్ కాలుమోపి అపవిత్రం చేశారని పేర్కొంటూ బుధవారం ఆ ప్రాంతాన్ని ఆవుపాలతో శుద్ధిచేశారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ దేశానికి అన్నం పెట్టే రైతన్నను రారాజు చేయాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే వాటికి మరమ్మతులు చేయకుండా గోదావరి జలాలను కాంగ్రెస్ సర్కార్ వృథా చేస్తున్నదని మండిపడ్డారు.