హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 71వసారి కావడం గమనార్హం. గురువారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొనున్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉన్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన హిందూ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తనకు హిట్లర్ స్ఫూర్తి అని, ఆయన స్ఫూర్తితోనే హైడ్రాను తీసుకొచ్చి నిర్మాణాలు కూలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నట్టు చెప్పడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
దీనిపై వివరణ ఇవ్వాలని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక తెలంగాణ నేతల కుట్ర ఉన్నదనే ఆగ్రహంతో అధిష్ఠానం ఉన్నట్టుగా తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన సమాచారంతోనే తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్టు స్వయంగా మధ్యప్రదేశ్ మంత్రి వెల్లడించారు. దీంతో మీనాక్షిపై ఉన్న కేసుల వివరాలను ఎవరు లీక్ చేశారో తేల్చాలని, దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎంను ఆదేశించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్ఠానంతో భేటీలో మీనాక్షీనటరాజన్ నామినేషన్ తిరస్కరణపై చర్చతోపాటు త్వరలో రాష్ట్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రచారం నేపథ్యంలో దీనిపైనా చర్చించే అవకాశం ఉన్నది.