Banakacherla | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను అడ్డుకునేందుకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వం లీకులు ఇచ్చింది.. దీనికి తగ్గట్టే ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కేంద్ర మంత్రితో భేటీని సీఎం రద్దు చేసుకున్నారు. దీంతో ఈ దాగుడుమూతలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. భేటీ ఎందుకు రద్దయింది? కారణం ఏమిటి? అని లోతుగా ఆరా తీస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను మరోసారి కలిసి, బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను స్పష్టంచేస్తారని, ప్రాజెక్టు నిర్మాణానానికి అనుమతులు ఇవ్వొద్దని గట్టిగా కోరుతారని సీఎంవో నుంచి లీకులు వచ్చాయి. ఈ మేరకు ఈ నెల 7న కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఖరారైనట్టు ఢిల్లీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం తర్వాత కలిసేందుకు అనుమతించినట్టు సమాచారం. దీనికి అనుగుణంగానే సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్‌ను ఖరారు చేసుకొని ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. తీరా ఢిల్లీకి వెళ్లాక కేంద్ర మంత్రిని కలవకుండా సీఎం అకస్మికంగా మనుసు మార్చుకున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అపాయింట్మెంట్ను రద్దు చేసుకున్నట్టు తెలిపాయి.
అపాయింట్మెంట్ రద్దు వెనుక రెండురకాల వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ఒంటరిగానే ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బనకచర్ల వివాదంపై ప్రతిపక్షాలు రేవంత్‌రెడ్డి కేంద్రంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి లేకుండా ఒక్కడినే కేంద్ర మంత్రిని కలిస్తే ఈ ఆరోపణలకు మరింత బలం ఇచ్చినట్టవుతుందని సీఎం భావించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందుకే అపాయింట్మెంట్ను రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి సన్నిహితులు మాత్రం.. మంత్రిని తోడు రమ్మని మాట వరుసకు కూడా అడగలేదని, సీఎం నేరుగా నీటిపారుదల అధికారులతో మాట్లాడి బ్రీఫ్ నోట్ తీసుకొని ఢిల్లీకి వెళ్లారని చెప్తున్నారు.
నీటి పారుదలశాఖ మంత్రి లేకపోవడంవల్ల అపాయింట్మెంట్ రద్దయ్యే ప్రశ్నే లేదన్నారు. ఏపీ ముఖ్య నేత రాయబారం వల్లే ఆగినట్టు గుసగుసలు. కేంద్ర నిపుణుల కమిటీ అభ్యంతరాల నేపథ్యంలో బనకచర్లకు తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అధికారికంగా ఫిర్యాదు చేస్తూ, అభ్యంతరాలు లేవనెత్తితే ప్రాజెక్టు మరింత వివాదాస్పదంగా మారుతుందని ఏపీ ముఖ్యనేత రాయబారం పంపినట్టు సమాచారం. ఈ ప్రతిపాదన వల్లే రేవంత్‌రెడ్డి తన మనసు మార్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం, మంత్రి ఉత్తమ్ నోరు తెరిస్తే వాస్తవం బయటికి వస్తుందని చెప్తున్నారు.