CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై అక్కడి తెలంగాణ ఎన్నారైలు, టీకాంగ్రెస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎంగా అమెరికా పర్యటనకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఎన్నారైలు, కాంగ్రెస్ అభిమానులను తప్ప మిగతా అందర్నీ పట్టించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ ఆవేదనను వెల్లడిస్తున్నారు. మిషన్ తెలంగాణ, ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో పోస్టులతో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎంగా తొలిసారి అమెరికాకు వచ్చిన రేవంత్‌రెడ్డిని ఆహ్వానించేందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని సంస్థల ప్రతినిధులు శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా ఎయిర్‌పోర్టుకు వెళ్లగా వారిని బయటే నిలబెట్టి, అవమానించారంటూ మిషన్ తెలంగాణలో పోస్ట్ చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వంటి పలు సంస్థల ప్రతినిధులనూ లోనికి అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు మద్దతుదారులు, ఏపీకి చెందినవారికి రేవంత్ అధిక ప్రాధాన్యం ఇచ్చారంటూ తెలంగాణ ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంను ఆహ్వానించటానికి వెళ్లినవారిలో ఒక్క ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మినహాయిస్తే మిగిలిన 95 శాతం మంది ఏపీ, టీడీపీవాళ్లేనని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఎంతో దూరం నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చిన తమకు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని, కానీ ఏపీ ఎన్నారైలు సులువుగా కలుసుకోగలిగారంటూ ఎన్నారై సతీశ్ పసుపులేటి ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలు, సెక్యూరిటీ పేరుతో తమను దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, టీడీపీనేతలే కాదు.. కర్ణాటక నేతలు కూడా కొందరు సీఎం రేవంత్‌రెడ్డిని కలవటం గమనార్హం. కర్ణాటక నేతలను కూడా కలిసేందుకు ఇష్టపడ్డ సీఎం.. తెలంగాణ కోసం కొట్లాడిన, తెలంగాణవాదులైన తమను కలిసేందుకు ఇష్టపడటం లేదని తెలంగాణ ఎన్నారైలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం చేసుకుంటున్న ఎంవోయూలపై విచారణ జరిపించాలని ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాహుల్‌గాంధీకి ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెబ్సైట్ కూడా లేని కంపెనీతో ఒప్పందం చేసుకోవటం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేని సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడి కంపెనీతో ఒప్పందం చేసుకోవటాన్ని కూడా ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను టీడీపీ, ఇతర ప్రాంతాల ఎన్నారైలే నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎంవోయూల్లో కుటుంబ కంపెనీల భాగస్వామ్యం లేకుండా చూడాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. ఎంవోయూలపై త్వరలోనే ఈడీ విచారణ కోరుతామని పేర్కొన్నారు.
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ అనుకూల మీడియా ప్రతినిధి సీఎం అమెరికా పర్యటనలో అంతా తానై వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్వచ్ఛ్‌బయో కంపెనీతో ఒప్పందంలో ఆయనదే కీలక పాత్ర అని తెలిసింది. కొన్ని ఎంవోయూల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. హర్ష పసునూరి, జగదీశ్వర్‌రెడ్డితో కలిసి స్వచ్ఛ్‌బయో ఏర్పాటులో ఆ వ్యక్తి కీలకంగా ఉన్నారని తెలిసింది.