హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులకు మోక్షం లభిస్తుందని తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. 162 కి.మీ. పొడవైన ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇదివరకే టెండర్లు పిలిచినప్పటికీ భూసేకరణ సమస్య కారణంగా ఇంకా ఏజెన్సీలను ఖరారు చేయలేదు. అయితే ట్రిపుల్ఆర్కు కేంద్రం నుంచి ఫైనాన్షియల్, క్యాబినెట్ అనుమతులు రావాల్సి ఉన్నదని అధికారులు చెప్తున్నారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన గడ్కరీని సీఎం రేవంత్, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఇందులో భాగంగా ట్రిపుల్ఆర్కు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులను వెంటనే ఇచ్చి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. భూసేకరణను పూర్తిచేయాలని సూచించినట్టు తెలిసింది. ఆ ప్రక్రియ పూర్తయితే ట్రిపుల్ఆర్ పనులను చేపట్టేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి 1,950 హెక్టార్ల భూములు సేకరించాల్సి ఉండగా.. అందులో ఇప్పటివరకు 85% భూసేకరణ పూర్తయింది. ట్రిపుల్ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు, పంటలు, ఇండ్లు తదితర ఆస్తులు కోల్పోతున్న బాధితులకు రూ.5,100 కోట్ల మేరకు నష్టపరిహారం అందించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఈ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉన్నది. దీంతో తమ వాటా కింద రూ.2,550 కోట్లు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,250 కోట్లు కేటాయించింది.
ట్రిపుల్ఆర్ భూసేకరణ కోసం గతంలో నోటిఫికేషన్ వెలువడేనాటికి ఉన్న భూముల ధరల ఆధారంగా ప్రభుత్వం ఎకరాకు రూ.6 నుంచి రూ.15 లక్షల వరకు నష్ట పరిహారాన్ని నిర్ణయిస్తూ అవార్డులు పాస్ చేసింది. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్బిట్రేటర్లను ఏర్పాటు చేసింది. భూముల విలువ, బాధితులకు జరుగుతున్న నష్టం ఆధారంగా ఆర్బిట్రేటర్లు పరిహారాన్ని నిర్ణయిస్తున్నారు.
అయినప్పటికీ భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు బాధితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. మరికొందరు తమ భూములను ఇచ్చేదే లేదని ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, భూసేకరణను వ్యతిరేకిస్తున్నవారితో చర్చించి వారు కోరుతున్న విధంగా నష్టపరిహారం చెల్లిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్తున్నారు. భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసి కేంద్రాన్ని సంప్రదిస్తే.. అక్కడి నుంచి అన్ని అనుమతులు వచ్చి వెంటనే పనులు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.