నల్లగొండ ప్రతినిధి, జూన్28(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పేరిట సీఎం రేవంత్‌రెడ్డి టూర్ ఆదివా రం గందరగోళంగా సాగింది. కీలకనేతల అలకలు, ఆగ్రహావేశాల మధ్య ముఖ్యమంత్రి తన పర్యటనను కొనసాగించారు. ముందుగా హ్యా మ్ రోడ్ల శంకుస్థాపన పేరుతో ఆదివారం దినపత్రికల్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో, నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్లలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫొటో గల్లంతైంది. ఆయనతో పాటు ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఫోటోలను సైతం విస్మరించారు.
రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ పేరిట ఇచ్చిన దినపత్రికల్లో ఇచ్చిన అడ్వైర్టెజ్మెంట్లలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు, ఫోటో లేకపోవడంపై గుత్తాతో పాటు ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆర్అండ్బీ శాఖ ఉన్నతాధికారులపై గుత్తా సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ యాడ్స్ మొత్తం కూడా మంత్రి కోమటిరెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్టు గుత్తాకు అధికారులు చెప్పుకొచ్చారు. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు గుత్తాను సంప్రదిస్తే ‘గతంలోనూ ఇలానే వ్వవహరించారు.. ఈ సారి ఊరుకునేది లేదు. అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇచ్చి మండలికి పిలిపిస్తా ను’ అని స్పష్టం చేశారు.
గుత్తా సీరియస్ కావడంతో నేరుగా సీఎం వో రంగంలోకి దిగినట్టు సమాచారం. గుత్తా సుఖేందర్‌రెడ్డితో సీఎంవో వర్గాలు మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. దీంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు హెలికాప్టర్లో నల్లగొండకు పర్యటనకు వెళ్దామంటూ ఆయనను ఆహ్వానించారు. నిజానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి రోడ్డు మార్గంలో నల్లగొండకు చేరుకుంటారని అధికారులు రూట్‌మ్యాప్ ఇ చ్చారు. సీఎం కలుగజేసుకొని గుత్తాను తన వెంట తీసుకొచ్చినట్టు చర్చ సాగింది.
ఇక డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేతను ఆది నుంచి మంత్రి కోమటిరెడ్డితో పాటు ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వేదికపైకి వచ్చే వీఐపీల జాబితాలో ఆయన పేరును ప్రస్తావించలేదు. దీంతో డీసీసీ అధ్యక్షుడు పీసీసీ చీఫ్‌తో పాటు ఎంపీ రఘువీర్‌రెడ్డికి పరిస్థితిని వివరించారు. చివరకు సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేర కు డీసీసీ అధ్యక్షుడిని సీఎం పర్యటనకు పోలీసులు వెంట ఉండి తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చేలా మంత్రి వెంకట్‌రెడ్డి వ్యవహరించినా ఆయన మాత్రం డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన పత్రిక యాడ్స్‌లో మంత్రి ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్‌ల తర్వాత రాజగోపాల్‌రెడ్డి ఫొటోను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు ఉ మ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు సభల్లో సీఎం పాల్గొంటే ఒక్క సభకు కూడా రాజగోపాల్‌రెడ్డి హాజరుకాలేదు. ఇదిలా ఉంటే సీఎం పర్యటనలో నిరసన తెలుపుతాడనే సమాచారంతో మునుగోడు యువజన కాంగ్రెస్ నేత జంగిలి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు.