World Bank | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ప్రపంచబ్యాంకుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధతను వ్యక్తంచేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వాషింగ్టన్లో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన అజయ్‌పాల్‌సింగ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్మ్యాపు రూపొందించాలని నిర్ణయించారు. గతంలో ఉమ్మ డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ప్రపంచబ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు.
పెద్ద ఎత్తున రుణాలు కూడా పొందారు. ఇప్పుడు బాబు సహచరుడిగా చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఆయన బాటలోనే నడుస్తున్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ ఏ నాడూ ప్రపంచబ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రపంచబ్యాంకు నుంచి రుణం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్‌బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ప్రధానంగా సిల్ డెవలప్మెంట్, రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్‌ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. బృందంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణువర్ధన్‌రెడ్డి, అజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పర్యటన: రామకృష్ణారావు
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ బృందం పలు అంతర్జాతీయ సంస్థలతో ఫలవంతమైన సమావేశాలు నిర్వహస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికల పట్ల ప్రపంచబ్యాంకు సహా అనేక సంస్థలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ కంపెనీలతో జరిగిన సమావేశాల్లో ప్రధానంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, నెట్ జీరో సిటీ అభివృద్ధి, మూసీ ప్రక్షాళన, డిజిటల్ హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ తదితర అంశాలు చర్చకు వచ్చాయని ఆయన బుధవారం ఎక్స్ వేదికగా వివరించారు.
మల్టీనేషనల్ కంపెనీలతో చర్చలు: జయేశ్‌రంజన్
అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం మల్టీ నేషనల్ కంపెనీలు, గ్లోబల్ లీడర్లు, ఇతర సంస్థలతో చర్చలు జరుపుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ చెప్పారు. రెండు రోజుల పర్యటనలో విజయవంతంగా చర్చలు, ఒప్పందాలు జరిగాయని, మిగిలిన నాలుగు రోజుల పర్యటన కూడా ఫలవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ర్టానికి ప్రయోజనం కలిగించే సంస్థలతోనే చర్చలు జరపుతున్నామని బుధవారం ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణలో ప్రచారం జరుగుతున్నట్టుగా రాష్ట్ర పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే విధంగా ఎలాంటి చర్చలు జరుపడం లేదని పేర్కొన్నారు. పదేండ్లుగా ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నానని, ఏజెండా అంశాలపైనే చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రేవంత్‌రెడ్డి అమెరికా మీటింగుల విశ్వసనీయతపై తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు పరిశీలించాకే ఆయా సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
ప్లీజ్ నమ్మండి.. పెట్టుబడులు నిజమే
సీఎం తమ్ముడి కంపెనీ, నాలుగు నెలలు నిండని కంపెనీలతో ఎంవోయూలు చేసుకుంటూ రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ సీఎంవో నుంచి వెలువడుతున్న ప్రకటనలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్ట నివారణ చర్య లు ప్రారంభించింది. అధికారులతో విదేశీ పర్యటనపై ప్రభుత్వం ఎక్స్ వేదిక వివరణలు ఇప్పిస్తున్నది.