మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊర్లలోనే మేము ఓట్లడుగుతాం.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వని ఊర్లలో బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటదా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లి గ్రామంలో శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ పది నెలల కాలంలో తాము చేసింది.. పదేండ్లలో మీరు చేసింది ప్రజలకు అర్థమైతదని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేయడం తాము సాధించిన విజయాలుగా చెప్పారు.
12 ఏండ్లు ప్రధానిగా మోదీ పాలన, పదేండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన, 13 నెలల్లో తమ ఇందిరమ్మ పాలనపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రావాలని, అంబేద్కర్ సాక్షిగా చర్చిద్దామని సవాల్ విసిరారు. పారా మెడికల్ ఉద్యోగాలకు యూరప్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని వివరించారు. దీనిపై అప్పక్‌పల్లిలో నర్సింగ్ కళాశాల విద్యార్థులు అవాక్కయ్యారు. ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్పకుండా, ఎక్కడో కల్పిస్తామనడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ ప్రారంభించిన అన్ని పనులు కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపనలు చేసి పూర్తిచేసినవే కావడం గమనార్హం. మెడికల్ కాలేజీని కేటాయించి, విద్య పరిశోధన కోసం ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణం, వసతి గృహాల కోసం కేసీఆర్ సర్కారు రూ.130 కోట్లను కేటాయించింది. మంత్రి హోదాలో కేటీఆర్ నాడు శంకుస్థాపన కూడా చేశారు. పూర్తయిన దానిని సీఎం ప్రారంభించడం కొసమెరుపు. నర్సింగ్ కళాశాలకూ గతంలో బీఆర్ఎస్ శంకుస్థాపన చేసింది. వాటినే సీఎం ప్రారంభించారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో మండల కార్యాలయాలు పోలీస్ స్టేషన్లలో భవన నిర్మాణాలకు గతంలోని నిధులు విడుదలై పూర్తయ్యాయి. వాటిని ఇప్పుడు సీఎం ప్రారంభించారు.
సీఎం రాకతో మహిళల అవస్థలు
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆయన ఆలయానికి వస్తున్నారని పోలీసులు ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. భక్తుల క్యూలైన్లను ఎక్కడికక్కడే ఆపివేశారు. అదే సమంలో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేందుకు బోనాలు ఎత్తుకొని ఆలయానికి వచ్చిన మహిళలు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అరగంటకు పైగా ఆలయం ఎదుటే ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది. సీఎం వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లే వరకు భక్తులను గుడి బయటే ఉంచడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. బోనం కుండలతో వచ్చిన వారిని మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉంచడమేమిటని మండిపడ్డారు. సీఎం వెళ్లిన తర్వాత ఒక్కసారిగా జనాలు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లడంతో తోపులాడుతున్నారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయానికి వచ్చే క్రమంలో పలువురు రైతులను ముందస్తుగా అరెస్టు చేసి ఠాణాల్లో ఉంచారు. సీఎం నియోజకవర్గానికి వచ్చే ప్రతిసారీ ఈ బాధలు తప్పడం లేదని, ఇంకెన్నాళ్లీ తిప్పలని రైతులు వాపోతున్నారు.