హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం సమావేశం కానున్నది. సచివాలయంలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇటీవల భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉన్నది. చెరువులు, నీటి వనరుల పరిరక్షణకు ఉద్దేశించిన ‘హైడ్రా’ను మరింత బలోపేతం చేయడంపై చర్చించి, ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. కొత్త ఆర్వోఆర్ చట్టంపై కూడా మంత్రివర్గం చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
ఇటీవలే ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తికాగా, వాటిని క్రోడీకరిస్తూ అధికారులు కొత్త ఆర్వోఆర్ చట్టానికి తుదిరూపు ఇచ్చారు. దీనిపై చర్చించి, ఆర్డినెన్స్ జారీ చేయాలా? అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలా? అనే అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ప్రభుత్వం ఇటీవల నియమించిన వ్యవసాయ, విద్యా కమిషన్లకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నది. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల జారీకి రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించనున్నట్టు తెలిసింది. దీంతోపాటు రాష్ట్రంలో వయసు, అర్హతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా ఇచ్చే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. కొత్తగా దాదాపు 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తెలుపనున్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. యూనివర్సిటీలకు కొత్త పేర్లకు ఆమోదం తెలుపనున్నది. వీర నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేర్లకు ఆమోదం తెలుపనున్నది.