హైదరాబాద్ : గ్రాడ్యుయేట్లు ఇచ్చిన రెఫరెండాన్ని శిరసావహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్ రెడ్డినే యువతకు పిలుపునిచ్చారని.. ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇస్తేనే ఓటేయాలని అడిగారని గుర్తుచేశారు. కానీ అదంతా పచ్చి అబద్ధం కాబట్టే గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్‌ను ఛీకొట్టారని స్పష్టం చేశారు.
అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలే ఇవ్వలేదని వై.సతీశ్‌రెడ్డి విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని.. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దానికి కూడా ఎగనామం పెట్టారని పేర్కొన్నారు.
ఇక స్కీముల విషయంలోనూ అదే జరిగిందని ఆరోపించారు. తమ స్కీములన్ని అమలైతేనే ఓటు వేయండని రేవంత్ రెడ్డి చెప్పారని వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతుభరోసా, బోనస్ అందినవాళ్లే తమకు ఓటు వేయండని పదే పదే ప్రసంగాలు చేశారని అన్నారు. రుణమాఫీ అయినవాళ్లే మాకు ఓటు వేయండి.. కానీ వాళ్లు మీకు నచ్చినోళ్లకు వేసుకోండని చెప్పారన్నారు. కానీ రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా రాలేదు.. బోనస్ బోగస్ అయ్యింది కాబట్టే గ్రాడ్యుయేట్ ఓటర్లు నిక్కచ్చిగా తీర్పు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారని తెలిపారు.
ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఏ ఒక్క పథకం తమకు అందలేదని బల్లగుద్ది మరీ గ్రాడ్యుయేట్లు తీర్పు చెప్పారని వై.సతీశ్‌రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని యువ ఓటర్లు తీర్పునిచ్చారన్నారు. ఇకనైనా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తమ అసమర్థతను ఒప్పుకుని.. రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ యువతకు క్షమాపణలు చెప్పి.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కొడంగలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మల్కాజ్ గిరికి వలస వచ్చినట్టుగా ఇప్పుడు కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి పదవిలో కొనసాగితే అంతకుమించిన అవమానం మరొకటి ఉండదని అన్నారు..