CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఆయనకు 28వ ఢిల్లీ పర్యటన కావడం గమనార్హం. శుక్రవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి గురువారమే ఢిల్లీకి వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనాల్సిందిగా సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు ఇతర నేతలను ఆహ్వానించనున్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 30న మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు సదస్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 4న పెద్దపల్లి, 7న నల్లగొండ జిల్లాలకు వెళ్లనున్నారు.