హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం వద్ద శనివారం 100 కొత్త ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార, ఇతర మంత్రులతో కలిసి సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ 100 బస్సుల్లో 90 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయని, శ్రీశైలం నడిపేందుకు 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్ బకాయిలను పరిషరించేందుకు రూ.280 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద 60 రోజుల్లో 15.21 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణానికి చెందిన రూ.535 కోట్ల చెక్కును మహిళలతో కలిసి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక, ఎమ్మెల్యేలతోపాటు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఘనతగా చెప్పుకుంటున్న మరో కార్యక్రమం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మరోసారి రుజువైంది. శనివారం హైదరాబాద్‌లో సీఎం, మంత్రులు అట్టహాసంగా ప్రారంభించిన 100 బస్సులను బీఆర్ఎస్ హయాంలోనే గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొత్తగా 1,500 ఆర్టీసీ బస్సులకు ఆర్డర్లు ఇచ్చి, బడ్జెట్ కేటాయింపులు జరిపి, టెండర్లు పూర్తిచేసుకొని, కొత్త బస్సులను దశలవారీగా ప్రారంభించాలని నాడే ఆర్టీసీ నిర్ణయించింది. బస్సుల నిర్మాణం పూర్తయి, వాటిని ప్రారంభించేందుకు ఆర్టీసీ సిద్ధమైన తరుణంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో కొత్త బస్సుల ప్రారంభోత్సవం నిలిచింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్డర్లతో వచ్చిన ఆర్టీసీ బస్సులను ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించింది.
మేడారంలో జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల 18 నుంచి 25 వరకు టీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6, 6.30 గంటలకు హైదరాబాద్ జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి, 2.30, 3.00 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని, పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310, సూపర్ లగ్జరీ బస్సుల్లో పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.450, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున చార్జీలు ఉంటాయని ఎండీ సజ్జనార్ తెలిపారు.