హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెల రోజుల తన ప్రస్థానం తృప్తినిచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులైన సందర్భంగా ఆదివారం ట్వీట్ చేశారు. ‘పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు అడుగులు వేస్తున్నది.
పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెకుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది’ అని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతున్నదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.