హన్వాడ, ఏప్రిల్ 21: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 130 రోజులైనా, ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టింపేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను ఆదివారం పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతో అప్పులెలా తీర్చాలో తెలియక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుల కష్టంపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని, ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాష్ట్రంలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.