CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి విషయంలో తనవైపు నుంచి తప్పు జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారు. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశంపై సీఎం సంజాయిషీ ఇచ్చుకున్నారు. జీవన్‌రెడ్డి మనస్తాపానికి గురైన విషయం వాస్తవమేనని అన్నారు. తమవైపు నుంచి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.
తమ ప్రభుత్వ విధానాలు నచ్చి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఇది జీవన్‌రెడ్డిని మనస్తాపానికి గురిచేసిందని తెలిపారు. అయినప్పటికీ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకున్నారని తెలిపారు. జీవన్‌రెడ్డి అనుభవం, పార్టీపై ఆయనకున్న కమిట్మెంట్ను అధిష్ఠానం గుర్తించిందని, ఆయన గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని చెప్పారు. జీవన్‌రెడ్డి తన అనుభవాన్ని ఉపయోగించి ఇకపై రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్న ఆశాభావాన్ని రేవంత్ వ్యక్తంచేశారు. జీవన్‌రెడ్డి విషయంలో కొందరు ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఏదైనా జరిగితే బాగుండునని ఎదురుచూశారని అన్నారు. వారి ఆశలు నెరవేరే అవకాశం జీవన్‌రెడ్డి ఇవ్వలేదని చెప్పారు.