హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రే వంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని స్పష్టంచేశారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్లగొండ జిల్లాకే కాకుండా.. తెలంగాణ రాష్ర్టానికి అత్యంత కీలకమని తెలిపారు.
ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉందని, శ్రీశైలం నుంచి అకంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 2027 డిసెంబరు 9లోగా ఎస్ఎల్బీఈసీని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్‌చానెల్‌లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమీక్షలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటి పారుదల శాఖ గౌరవ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్సింగ్, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.