హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : నిత్యం నోరుజారడం, నవ్వులపాలవడం అలవాటు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం మరోసారి నోరుజారారు. అవగాహన లేమిని బయటపెట్టుకున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రి మోదీ జన్మించిన రాష్ట్రం గుజరాత్. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర’ అంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. మోదీ మూడుసార్లు ఇదేస్థానం నుంచి ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి తడబాటు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. దేశ ప్రజలెవరికీ తెలియకుండా వారణాసి.. ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు ఎప్పుడు వచ్చిందో రేవంత్‌రెడ్డి సెలవివ్వాలంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అతి తెలివిని ప్రదర్శిస్తూ తెలంగాణ పరువుతీస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా మాట్లాడటం రేవంత్‌రెడ్డికి ఇదే కొత్త కాదు. గతంలోనూ ఇలా మాట్లాడి రాష్ట్ర పరువును గంగపాలు చేశారని గుర్తుచేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఎలాంటి సెటైర్లు పేలుతున్నాయో ఒకసారి చూద్దాం.
రేవంత్‌రెడ్డి మాట: బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉన్నది. నాగార్జునసాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్ట్‌లను నెహ్రూ ప్రారంభించారు. ఇందిరాగాంధీ సాగు, తాగునీటిని పారించారు.
సోషల్ మీడియా తూటా: బాక్రానంగల్ డ్యామ్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నదని ఎవరిని అడిగినా చెబుతారు.
రేవంత్‌రెడ్డి మాట: దేవాదుల గోదావరి బేసినే కదా?
సోషల్ మీడియా తూటా: దేవాదుల గోదావరి బేసిన్లో ఉన్నదన్నది కూడా తెలియకపాయే. దేవాదుల వద్ద ప్రాజెక్ట్‌ను కట్టాలన్నది ఏండ్ల కల. దీనిపై మనకు ఏమాత్రం అవగాహన లేకపాయే?
రేవంత్‌రెడ్డి మాట: మీకు తెలుసా చిరంజీవి గారూ.. వికారాబాద్‌లో నిజాం లెప్రసీ సెంటర్‌ను కట్టించారు.
సోషల్ మీడియా తూటా: అయ్యో రామ రామ! నిజాం కట్టించింది లెప్రసీ సెంటర్ కాదురా.. అయ్యా.. అది టీబీ సెంటర్. మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ వికారాబాద్ జిల్లా కిందకే వస్తుంది. టీబీకి.. లెప్రసీకి తేడా కూడా తెల్వకపాయే.
రేవంత్‌రెడ్డి మాట: రాజీవ్‌గాంధీ సతీమణి శ్రీమతి ఇందిరాగాంధీ (గాంధీభవన్‌లో ప్రెస్మీట్లో)
సోషల్ మీడియా తూటా: అయ్యో నేనుండా.. ఎక్కడికైనా వెళ్లిపోతా. రాజీవ్‌గాంధీ సతీమణి సోనియాగాంధీ. అన్నా.. ఆమె మీ అధినాయకురాలే. జర చూసుకుని మాట్లాడే.
రేవంత్‌రెడ్డి మాట: మన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గారు సీఎం అయిన తర్వాత..
సోషల్ మీడియా తూటా: అన్నో.. నువ్వేనే సీఎంవి. ఉత్తమన్న నీళ్లమంత్రి. నువ్వట్ల అంటే మా ఉత్తమన్నకు కుర్చీపై ఆశపుడ్తది..
రేవంత్‌రెడ్డి మాట: బనకచర్లతో ఏ నదులను అనుసంధానిస్తున్నారు (ఆల్ పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో)
సోషల్ మీడియా తూటా: బనకచర్లను ఏ నదిపై కడుతున్నారో తెలియకుండానే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారా?