కులగణన, క్యాబినెట్‌పై చర్చించినట్టు వెల్లడి నేను కుర్చీలో కూర్చొని నా ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినేవాళ్లే లేరు. నా కుర్చీపైనే ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుందామనుకునేవాళ్లే ఉన్నారు. అట్లా సాధ్యం కాదు కదా? చెప్పేవాళ్లే ఎక్కువ ఉన్నారు. మనం చెప్తే వినేవాళ్లు ఏరి?
-ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ) : ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘నా పక్కనున్నవాళ్లే పని చేయనిస్తలేరు. వాళ్లు చేస్తలేరు.. నన్ను చేయనిస్తలేరు. వాళ్లంతా నా కుర్చీ కోసం ఆశపడుతున్నారు. అందుకోసం ప్రయత్నం చేస్తున్నరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.పార్టీలో సమన్వయ లోపం, ఎంపీల మధ్య అవగాహన లేకపోవడం గురించి మీడియా ప్రతినిధులతోమాట్లాడుతున్న క్రమంలో అన్యాపదేశంగా రాష్ట్రంలో పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అలాగే ఉన్నదని పరోక్షంగా తన మంత్రివర్గ సహచరులపై అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పదవుల పంచాయితీ, గ్రూపు రాజకీయాల బండారం మొత్తం బట్టబయలైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంత మంది మీడియా ప్రతినిధుల వద్ద కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పోరుపై పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. ఇద్దరు, ముగ్గురు మంత్రులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు చర్చ నడుస్తున్నది.
సీఎం వ్యాఖ్యలు.. అనేక అనుమానాలు
కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉన్నదనేది బహిరంగ రహస్యమే. అయితే కొన్నిసార్లు ఇది బయటకు కనిపించినా మరికొన్ని సార్లు అంతర్గతంగానే ముగుస్తున్నాయి. కానీ ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తి అంతర్గత కీచులాటలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారంటే పార్టీలో గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, కొట్లాటలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడూ ఎక్కువగా స్పందించలేదు. ఒకవేళ స్పందించినా కాంగ్రెస్‌లో స్వాతంత్య్రం ఎక్కువని, అన్నీ సర్దుకుంటాయని చెప్తూ ఉండేవారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఏకంగా తన పదవికే ఎసరు పెట్టేలా చూస్తున్నారంటూ చెప్పడం అనేక అనుమానాలను లెవనెత్తుతున్నది. ‘నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు& అయినా నా పని నేను చేస్తున్నా. నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను’ అని కూడా మాట్లాడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదీ ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ సమయంలోనే మాట్లాడటంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం రేవంత్‌రెడ్డి ఆ వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ కూడా జరుగుతున్నది.
ఆర్నెళ్ల తర్వాత రాహుల్‌తో భేటీ
సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన ఆయన శనివారం రాహుల్ గాంధీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. వాస్తవానికి రాహుల్ గాంధీ షెడ్యూల్లో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ లేదని తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో రాహుల్ గాంధీ రెండు రోజుల్లో విదేశాలకు వెళ్తున్నారని సమాచారం. ఇదే జరిగితే మరో పదిహేను రోజుల నుంచి నెల పాటు రాహుల్ అందుబాటులోకి రావడం కష్టమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాయబారం నడిపించినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై రాష్ట్రంలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రాహుల్ గాంధీకి చెప్పినట్టు తెలిసింది. దీంతో అన్యమనస్కంగానే రాహుల్ గాంధీ అనుమతిచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఆగమాగం ఢిల్లీకి పయనమైనట్టు తెలుస్తున్నది. ఈ భేటీ ద్వారా ఇద్దరి మధ్య గ్యాప్ లేదని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ఎమ్మెల్యేలపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందో!
చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలని, కులగణన పక్కాగా జరిగిందని చెప్పినట్టు సమాచారం. కులగణన పూర్తి వివరాలను రాహుల్ గాంధీకి వివరించానని, కులగణనపై కాంగ్రెస్ తరఫున తాను ప్రజలకు హామీ ఇచ్చానని, దీన్ని అమలు చేయకుంటే ప్రజలు ప్రశ్నించేది తననేనని అన్నట్టు తెలిసింది. క్యాబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని, ఇందులో తన ప్రమేయం ఏమీ ఉండదని, ప్రధాని మోదీని కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానని చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి చెప్పినట్టు చర్చ నడుస్తున్నది.