హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, రెండోసారి తన మీద నమ్మకం ఉంచి జనం ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తంచేశారు. శాసనమండలి ప్రాంగణంలో శనివారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల కోట్ల రుణమాఫీ జరిగిందని, ఒక్క కుటుంబంలో నలుగురు ఉంటే అందరికీ రుణమాఫీ చేశామని, అటువంటి ఉమ్మడి కుటుంబాలలోని వారు కోటి మంది ఉంటారని చెప్పుకొచ్చారు.
కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తామని, వారు వేసే ఓట్లతోనే గెలుస్తామని అన్నారు. రాష్ట్రంలో కులగణన ఇప్పుడు కాకుంటే ఇక ఎప్పటికీ కాకపోయేదని, ప్రజలెవరైనా ఆస్తులు, అప్పుల గురించి తప్పుగా చెప్పవచ్చేమో కానీ కులాన్ని ఎవరూ తప్పుగా చెప్పరు అని అన్నారు. జనాభా లెక్కల గురించి కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అడిగిందని, దీని ప్రకారం 2026లో జనాభా లెక్కలు పూర్తిచేసి 2027లో నోటిఫై చేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం డీలిమిటేషన్‌కు సమాయత్తం అవుతుందని, ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ర్టాలు నష్టపోవద్దని తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
ఈ నెల 31వ తేదీలోగా రైతులందరికీ రైతుభరోసా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. రైతబంధు కింద గత ప్రభుత్వం ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.10 వేలను అందించిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.12 వేలకు పెంచి అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుభరోసా నిధులను విడతల వారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై మంత్రి స్పందించారు. కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాను తేల్చేందుకు కేంద్రం వద్ద పోరాడుతున్నామని చెప్పారు.