హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): భూ భారతి త్వరలో అమల్లోకి వస్తుందని, రెవెన్యూ అధికారులు సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) కొత్త సంవత్సర డైరీలను సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల మీద ఉన్నదని సీఎం తెలిపారు.
డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్షకార్యదర్శులు ఎస్ రాములు, రమేశ్ పాక , ఫూల్ సింగ్ హాన్, శ్రీనివాసులు, టీజీఆర్ఎస్ఏ అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, భిక్షం, మహిళా అధ్యక్షురాలు సుజాత హాన్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి చట్టాన్ని అమలు చేయడంలో తమవంతు సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి ట్రెసా ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు నిరంజన్ రావ్, దేశ్యా నాయక్, నాగమణి, జాయింట్ సెక్రటరీ వాణిరెడ్డి, రమణ్ రెడ్డి, గంగాధర్, కిరణ్, బొమ్మ రాములు పాల్గొన్నారు.