CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, జనవరి 26 నుంచి రైతుభరోసా ఇవ్వనున్నామని తెలిపారు. పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ైప్లెఓవర్కి మాజీ ప్రధాని దివంగత మన్మోహన్సింగ్ పేరు పెట్టినట్టు తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా మూడో ప్యాకేజీ పనులను పూర్తిచేయాలని సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బుధవారం జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిని, క్షేత్రస్థాయిలో ఇబ్బందుల గురించి అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్యాకేజీ 3లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు చేపట్టిన ప్రధాన కాల్వ తవ్వకం పనులను వీలైనంత త్వరగా పూర్తిగాచేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే పుట్టంగండి సిస్టర్న్‌కు మరమ్మతు చేయించాలని సూచించారు. లీకేజీల కారణంగా మూడు నెలలు పడుతుందని అధికారులు వివరించారు. తాగునీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయం చూడాలని ఆదేశించారు. రిజర్వాయర్‌పై నిర్మాణ సంస్థతో కలిసి సంయుక్త తనిఖీలు చేపట్టాలని సూచించారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 8(నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్ పర్యటన కోసం సీఎం రేవంత్‌కు పాస్‌పోర్టు జారీ చేస్తూ ఏసీబీ కోర్టు బుధవా రం ఉత్తర్వులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసు లో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ షరతుల ప్రకారం పాస్‌పోర్టును ఏసీబీ కోర్టులో జమ చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటన కోసం పాస్‌పోర్టు జారీ చేయాలని రేవంత్ తరఫు న్యాయవాది పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు 50వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పూచీకత్తును కోర్టుకు సమర్పించిన తర్వాత పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి రేవంత్‌రెడ్డి పాస్‌పోర్ట్‌ను తెప్పించింది. రేవంత్ తరఫున ఆయన సోదరుడు పాస్‌పోర్టును తీసుకుంటున్నట్టు కోర్టులో సంతకం చేశారు. ఈ నెల 14న విదేశీ పర్యటనకు వెళ్లనున్న రేవంత్‌రెడ్డి 20 నుంచి 22వ తేదీ వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం 55వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు.