హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో సీఎం మాట్లాడా రు. రూ.35వేల కోట్లతో 360 కిలోమీటర్ల పొడవున ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నామని తెలిపారు. రీజినల్ రింగురోడ్డుకు అనుబంధంగానే ముచ్చర్లలో 40 నుంచి 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని పునరుద్ఘాటించారు. ముచ్చర్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్ కూడా టోక్యో, న్యూ యార్క్లాగా మారుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు 7వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మూసీ పునరుజ్జీవనానికి లక్షన్నర కోట్లు అవసరమని అన్నారు. ఏడాదిలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం 29 % పెరిగిందని అన్నారు. నగరంలో నీటిని నిల్వ చేసేందుకు 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ హార్వెస్టింగ్ బావులను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు.
హైడ్రా కూల్చివేతలు ఆపేదిలేదు
అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూలుస్తున్నదని, హైదరాబాద్‌లో నిర్మాణాల కూల్చివేతలను మున్ముందు కూడా కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గబోమని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి లక్షన్నర కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మం త్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ ఉపసంఘానికి ప్రతిపక్షాలు ప్రతిపాదనలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు.
ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల అప్పు
ఆర్బీఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పుగా తీసుకున్నది. వెయ్యి కోట్ల విలువై న రెండు బాండ్లను వేర్వేరుగా 20 ఏండ్లు, 21 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ ఆర్బీఐ కి జారీచేసింది. వీటిని వేలం వేసిన ఆర్బీఐ.. ఆ మొత్తాన్ని రాష్ట్ర ఖజానాకు చేరవేసింది. దీంతో ఆర్బీఐ వద్ద తీసుకున్న మొత్తం అప్పు రూ.72,118 కోట్లకు చేరింది. ఇవికాకుండా ఈ నెలలోనే అదనంగా మరో రూ.10,000 కోట్లు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరింది. నేరుగా ఆర్బీఐ నుంచి సేకరించే రుణాలు సరిపోక.. కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు కూడా గ్యారెంటీలు ఇస్తున్నది.