వికారాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశ భద్రతలో రాడార్ స్టేషన్ అత్యంత కీలకమని, దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రంతో పర్యావరణానికి హాని ఉండదని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని, భద్రత విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోమని చెప్పారు. దామగుండం రాడార్ కేంద్రంతో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు కష్టజీవులని, రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరుందని కొనియాడారు.
తెలంగాణ మరో ముందడుగు: సీఎం
దేశ రక్షణ విషయంలో తెలంగాణ మరో ముందడుగు వేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సముద్రంలో ప్రయాణించే నౌకలను మానిటరింగ్ చేయడానికి వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని దామగుండంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. రాడార్ కేంద్రం ఏర్పాటును కొందరు వివాదం చేస్తున్నారని, రాడార్ కేంద్రంతో తెలంగాణకు, వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమిళనాడులో 35 ఏండ్ల క్రితం నేవీ రాడార్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని, అక్కడ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు.
దామగుండంలో అడవిలో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందని, అక్కడికి ప్రజలు వెళ్లేందుకు నిబంధనలు పెట్టొద్దని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రి సురేఖ, చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, యాదయ్య, నావికాదళ ప్రధాన అధికారి దినేశ్ త్రిపాఠి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర పాల్గొన్నారు.