హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా చేసి, సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో మెగా గ్రోత్ కారిడార్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్, నల్లగొండ,
యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపే కారిడార్, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ల ఏర్పాటులో అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలని సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఉబర్ సీఈవో ఖోస్రోసాహి కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరించనున్నట్టు సీఎంకు వివరించారు. ఫ్యూచర్‌సిటీలో కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. నగరాల్లో పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం ఉబర్ సీఈవోకు సూచించారు. వ్యాపార విస్తరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఉబర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.