హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోని లోపాలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదిక ప్రకారం తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్షించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీలతో శనివారం సీఎం భేటీ అయ్యారు.
ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించారు. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసు మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్తో 3 బరాజ్‌లను అధ్యయనం చేయించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. తొలుత అన్నారం బరాజ్‌ను అధ్యయనం చేయించాలని అధికారులు సీఎం, మంత్రులకు వివరించినట్టు సమాచారం. ఆ దిశగా చర్యలు చేపట్టాలని, సీడబ్ల్యూపీఆర్ఎస్ను సంప్రదించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారని అధికారవర్గాలు వెల్లడించాయి. మరో నెల రోజుల్లో వానకాలం ప్రారంభంలోగా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రిపేర్లు చేయాలా..? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా..? ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అకడి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.