CM Revanth | రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు యువతకు ఉపాధి కల్పించే ఆదాయ వనరుగా పర్యాటకశాఖ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే వనరులు మనకు ఎన్నో ఉన్నా.. గతంలో ప్రచారంపైనా శ్రద్ధ చూపకపోవడం, వినూత్న పద్ధతిలో ఆలోచించకపోవడంతో ఈ రంగంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదన్నారు. తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్‌కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. పర్యాటక శాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కల్పించాలని సూచించారు. సాగర్ బ్యాక్ వాటర్‌లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని.. డిసెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదికగా మార్చాలని సీఎం చెప్పారు.
ఆలయాలు, పులుల అభయారణ్యాలకు పర్యాటకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని.. ఆ దిశలో దృష్టి సారించి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం, సలేశ్వరం, రామప్ప ఆలయాలు, మల్లెల తీర్థం, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైనా ఆలయాలు ఇలా ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపర్చడంతో పాటు సరైన ప్రచారం కల్పించాలని సూచించారు. భువనగిరి కోట రోప్‌వే పనులపై ఆరా తీశారు. పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకోవాలని.. ఒకశాఖ విధానాలు మరో శాఖ విధానాలకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.