HCU | హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం సినీ పరిశ్రమకు చెందిన.. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి ఫోన్ చేశారు. ‘ఏందన్నా.. హెచ్సీయూ భూముల విషయంపై మీ వాళ్లంతా వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నరు. మీరేం చేస్తున్నరు? జర వాళ్లను ట్వీట్లు చేయకుండా ఆపండి’ అంటూ కోరినట్టు తెలిసింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు సైతం హెచ్సీయూ ఘటనను ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపైనా సీఎం రేవంత్రెడ్డి మరో కీలక నేతకు సూచించినట్టు సమాచారం. ‘జర వాళ్లతో మాట్లాడి ఆ ట్వీట్లు తీసేయిమనండి. ఆ వ్యతిరేక ప్రచారాన్ని ఆపించండి’ అంటూ వేడుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ‘సేవ్ హెచ్సీయూ.. సేవ్ ఎన్విరాన్మెంట్’ అంటూ విద్యార్థుల పోరాటానికి సినీ, పారిశ్రామిక, మీడియా వర్గాల ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ల దాడితో రేవంత్ సర్కారు కలవర పడుతున్నది.
ఓవైపు విద్యార్థుల నిరసన.. మరోవైపు ప్రముఖల ట్వీట్లతో ప్రజల్లోనూ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా సీఎం మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఓ సినీ ప్రముఖుడికి ఫోన్ చేసి ‘మీ వాళ్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? వాళ్లతో మాట్లాడి ఆపలేరా?’ అంటూ కోరినట్టుగా తెలిసింది. సదరు సినీ ప్రముఖుడు సైతం తన సన్నిహితుల వద్ద ఆవేదన వెళ్లగక్కినట్టు సమాచారం. ‘ప్రభుత్వం చేసేదే తప్పు పని. అయినా వాళ్లందరికీ నేనేమైనా బాసునా? నేను చెప్తే వినడానికి! ఏదో ఓ స్థాయిలో ఉన్నాం అంతే! అంతదానికే మనం చెప్తే వింటారనుకుంటే ఎట్ల? అయినా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనిని వ్యతిరేకించకుండా ఎట్లా ఉంటాం? ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించిన విషయం’ అంటూ సదరు కీలక వ్యక్తి తన మనుసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టుగా తెలిసింది.
నేనేం ముట్టుకున్నా.. అగ్గవుతున్నది!
ఇక మంత్రులతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ‘ఏందన్నా.. నేను ఏది ముట్టుకున్నా.. అగ్గయి భగ్గుమంటున్నది. ఎందుకిట్లా అయితున్నది?’ అంటూ వాపోయినట్టు తెలిసింది. రేవంత్ సర్కారు తీసుకుంటున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. లగచర్లలో గిరిజనుల భూముల సేకరణ, మూసీ, హైడ్రా కూల్చివేతలు, వ్యవసాయ యూనివర్సిటీల భూముల సేకరణ, ఇప్పుడు హెచ్సీయూ భూముల సేకరణ ఇలా ప్రతి అంశంలోనూ సర్కారుకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీంతో సీఎం రేవంత్రెడ్డి అసహనానికి గురైనట్టు సమాచారం.