Operation Musi | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నామని,ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆగబోదని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టుల్లో భూసేకరణ తప్పనిసరి అని, ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా నిర్వాసితులకు ఏం చేయాలో సలహాలివ్వాలని అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రేరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగ నియామక పత్రాలు అందించటం సంతోషంగా ఉన్నదని, ఏండ్లుగా నిరీక్షించిన అభ్యర్థుల కల సాకారమవుతున్నదని తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి అద్భుత కట్టడాలను కట్టిన ఇంజినీర్లను ఆదర్శంగా తీసుకోవాలని, ఉద్యోగంలో చేరింది మొదలు విరమణ వరకు ఒకేవిధంగా వ్యవహరించాలని సూచించారు. అక్టోబర్ 9న 11,063 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని సీఎం వెల్లడించారు.
మూసీ ప్రక్షాళన ఆగబోదు
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బతకాలా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ పరివాహాక ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దామని తెలిపారు. ప్రతిదానికి అడ్డుపడకుండా, మూసీ బాధితులను ఎలా ఆదుకోవాలనే అంశంపై సలహాలివ్వాలని ప్రతిపక్ష నేతలను కోరారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, కే కేశవరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.