ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలితే రేవంత్‌రెడ్డిని తిట్టొచ్చు.. రోడ్డు మీద ప్రమాదమైతే రేవంత్‌రెడ్డిని తిట్టొచ్చు.. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్‌రెడ్డిని తిట్టొచ్చు.. బీఆర్ఎస్కు ఇదేం సంబురం? మేము అధికారంలోకి వచ్చి పది నెలలు కూడా కాలేదు..అప్పుడే ఏడుపా? మీకు పదేండ్లు పాలించిన అనుభవం ఉన్నది. నీళ్ల సమస్యలు, కరెంటు సమస్యలపై సూచనలు చెయ్యండి. ప్రజా సమస్యలపైనా.. ప్రాజెక్టుల్లో ప్రమాదం వచ్చినా సూచనలివ్వండి.
– మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన ‘ఇందిర మహిళా శక్తి’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి, గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభుత్వాధినేతగా ఆదుకోవాల్సిందిపోయి తానేమీ చేయలేనని చేతులు దులుపుకొన్నారు. నోటికాడి కూడు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఆత్మబలిదానాలు చేసుకుంటున్న అన్నదాతల మరణాలను.. రోడ్డు ప్రమాదాలతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండాకాలంలో పంటలు ఎండో.. రోడ్డు ప్రమాదంలోనో ప్రజలు సచ్చిపోతే బీఆర్ఎస్ నేతలు తనను తిడుతున్నారని, తనను తిడితే ఏమొస్తదని చెప్పడంపై మండిపడుతున్నారు.
ఓవైపు పెట్టుబడి సాయం అందకపోయినా అప్పులు తెచ్చి సాగు మొదలుపెడితే నీళ్లివ్వకుండా, కరెంటు కోతలు విధిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్న సర్కారు కాఠిణ్యానికి రైతులు అల్లాడుతున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ఓదార్చి, వాళ్లకు చేతనైన సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా సంఘాల సభ్యులతో జరిగిన సభ వేదికగా పెడబొబ్బలు పెట్టడం, తనను తిడుతున్నారంటూ సానుభూతి కోసం పాకులాడం వింతగా, వికారంగా ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.
పంటలు ఎండిపోతుంటే, జనం చనిపోతుంటే ఆ బాధ తో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వా లి కానీ, తనను తిడితే ఏమొస్తుందని బహిరంగ వేదిక మీదనే చెప్పడానిన తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తనను తిట్టే బదులు ప్రభుత్వానికి అండగా నిలబడాలని, పదేండ్ల పాలనా అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ను కోరడం సర్కారు చేతగాని తనమేనని వారు అంటున్నారు. తనకు ప్రభుత్వంపై, పరిపాలనపై పట్టురావడం లేదని.. మంత్రులు, అధికారులు తన మాట వినడం లేదని.. తనకు సలహాలు ఇచ్చి కాపాడాలని ఇటీవల ఒక సీనియర్ నేత ఇంటికి వెళ్లి వేడుకున్న తర్వాతే ముఖ్యమంత్రి నుంచి ‘నన్ను తిడుతున్నరు’ అనే వ్యాఖ్యలు రావడం ఆసక్తికరమని ప్ర ముఖ రాజకీయ పరిశీలకులు ఒకరు విశ్లేషించారు.
పరిపాలనాపరమైన వైఫల్యం నుంచి జనం దృష్టి మళ్లించి సానుభూతిని కొట్టేసేందుకు చేసిన విఫల యత్నమని, ఛీప్ టాక్టిక్ అని ఆయన పేర్కొన్నారు. చిన్నచిన్న ప్రమాదాలకు కూడా తననే బాధ్యుడిని చేయడమేమిటని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ‘సీఎం చిన్నచిన్న ప్రమాదాలు అని చెప్పడం విడ్డూరం. నిరుడు పెద్దవాగు మొత్తం కొట్టుకుపోయి పెద్ద ప్రమాదం జరిగింది. ఆ తర్వాత సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగింది. ఇటీవల అవగాహన లేకుండా, కనీస జాగ్రత్తలు పాటించకుండా గొప్పలకుపోయి హడావుడిగా చేసిన పనుల కారణంగా ఎస్ఎల్బీసీ సొరంగంలో భారీ ప్రమాదం జరిగింది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా 8 మంది కార్మికులు బలయ్యారు. వారి అస్థికలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టే ప్రమాదంలో పడింది. భవిష్యత్తులో మళ్లీ చేపట్టే అవకాశం లేకుండాపోయింది. ఇది చిన్న ప్రమాదం ఎలా అవుతుంది? సీఎం ఇలా బాధ్యతారాహిత్యం గా మాట్లాడటం హేయం’ అని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రై తాంగం తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా, ప్రాజెక్టులను నిర్వహించే తెలివి కాంగ్రెస్ సర్కారుకు లేదని అన్నదాతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ జలప్రదాయిని కాళేశ్వ రం ప్రాజెక్టు, రిజర్వాయర్లను ఏడాదికాలంగా కావాలనే ఎండబెట్టబెట్టి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇవాళ నీటి సమస్యను అధిగమించటానికి పదేండ్ల పరిపాలనా అనుభవంతో సూచనలు చేయాలని కోరటం విడ్డూరమని విమర్శిస్తున్నారు. పైగా ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పడంపై వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. ‘ఎండాకాలం అంటేనే ఎండలుంటయి. ఎండాకాలంలో ఎండలుండక వానలుంటయా? ఎండలున్నప్పుడే సరైన రీతిలో నీళ్లిచ్చి పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటది. అది చేయలేక ఎండకాలం ఎండలున్నయి కాబట్టే పంటలు ఎండిపోయినయి. వానకాలంలో వరదలు వచ్చినయి కా బట్టే పంటలు కొట్టుకుపోయినయని చెప్పడాని కి ప్రభుత్వమెందుకు? ఇన్ని వ్యవస్థలు ఎందు కు? ఇంత మంది అధికారులు ఎందుకు’ అని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు ఆక్షేపించారు.
పంటలు ఎండిపోతున్న వేళ ఏం చేయాలో పాలుపోక ప్రతిపక్షాల సలహాలు, సూచనలు అంటూ కపట నాటకానికి తెరలేపారని రేవంత్‌రెడ్డి తీరును పలువురు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సలహాలు, సూచనలు ఇవ్వటానికి కంటే ముందు సీఎంగా రేవంత్‌రెడ్డి నీళ్ల సమస్యకు మూలకారణం ఏమిటో చిత్తశుద్ధితో వివరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే బంగారం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని మండిపడుతున్నారు. 300 పిల్లర్లున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక పిల్లర్‌లో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టునే ఏడాదికాలంగా పడావు పెట్టారని, ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న పాలమూరు ఎత్తిపోతల నుంచి ఇప్పటి వరకు చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తుతున్నారు.
నీళ్ల సమస్యను అధిగమించటానికి సలహాలు ఇవ్వమని అడగటం రాజకీయ బికారితనమని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపమేనని అంటున్నారు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతుల కడుపు కొడుతున్నారని విమర్శిస్తున్నారు. ‘రాష్ట్రంలో నీటిని నిల్వ చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కట్టిన జలాశయాలు, బాగుచేసిన చెరువులు సిద్ధంగా ఉన్నయి. ఈసారి వానకాలంలో అద్భుతంగా వానలు పడ్డయి. రికార్డుస్థాయిలో నదులకు అనేక నెలల పాటు వరదలు వచ్చినయి.
ఇన్ని ఏర్పాటు ఉన్నయి. ఈ నీళ్లతో చెరువులు, రిజర్వాయర్లు ముందే నింపుకోకుండా ఇప్పుడు పంటలు ఎండుతున్నయని సీఎం అంటున్నరు. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తే ఈ మాటలంటే ఇక ప్రజలు వారి బాధలు ఎవరికి చెప్పుకుంటరు? ఇక ప్రజలు ఎక్కడికిపోవాలి? ప్రజలు ఏమైపోవాలి? ఇట్ల మాట్లాడితే సానుభూతి వచ్చే సంగతేమో గానీ, ప్రజల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు ’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు దుయ్యబట్టారు.
ఒక కన్నెపల్లి పంప్‌హౌస్ బటన్ ఆన్ చేస్తే చాలని యాసంగి పంటలకు సరిపోయేంత నీళ్లు వస్తాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ నీళ్ల మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కాళేశ్వరం తమ చేతికిస్తే కేవలం మూడు రోజుల్లో ఈ ఎండాకాలంలో కూడా రైతాంగానికి నీళ్లు అందిస్తామని, చివరి ఆయకట్టు వరకు జలాలు పారిస్తామని గతంలో హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను ఈ నేపథ్యంలో నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఎకరానికి నీరందించామని, కాంగ్రెస్ ఇసుక వ్యాపార దాహానికి రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.
సలహాలు, సూచనలు అంటూ ప్రతిపక్షాలను బద్నాం చేసే ఎత్తుల కంటే, కాళేశ్వరం నీళ్లతో సాగులో ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్ చేశారు. పదేండ్ల పాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి పంటలు కాపాడాలని పేర్కొన్నారు. ఈ సీఎంను అన్నదాతలు ఎప్పటికీ క్షమించరని చెప్పారు. గతంలో హరిశ్‌రావు చెప్పినట్టు.. బీఆర్ఎస్కు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించి ఉంటే ఇవ్వాళ ఈ కష్టం వచ్చేది కాదని రైతన్నలు చెబుతున్నారు. పంటలు ఎండేవి కావని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు.