హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): తనను పదేండ్లు ఆశీర్వదిస్తే రాష్ర్టాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతానని, బెంగళూ రు, ముంబై, ఢిల్లీతో కాకుండా న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండ లం తిర్మలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
కేసీఆర్ ప్రభుత్వం తన ను అరెస్ట్ (ఓటుకు నోటు కేసులో) చేసినప్పు డే ప్రతినబూనానని, ఎైట్లెనా ఆయనను పడగొడతనని చెప్పానని, చెప్పినట్టే కేసీఆర్‌ను పడగొట్టానని, ఆయన కుర్చీలో కూర్చోవాలన్న తన లక్ష్యం నెరవేరిందన్నారు. దేవుడిని వివాదాల్లోకి, రాజకీయాల్లోకి లాగదల్చుకోలేదంటూనే కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కారు. లక్ష్మీనరసింహస్వామి వద్ద అపచారం జరగడంతోనే కేసీఆర్ కాలు విరిగినట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు.
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి వైటీడీ(యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్బోర్డు) ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. గంధమల్ల రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. గుజరాత్లో సబర్మతి, యూపీలో గంగానదిని ప్రక్షాళన చేసుకున్నారని, కానీ తాము మూసీ ప్రక్షాళన చేద్దామంటే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఎవరు అడ్డం వచ్చినా మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని తేల్చి చెప్పారు.
‘ఒకనాడు ఇంటాయనను బస్సు కిరాయి అడిగే మీరు.. సాయంత్రం బెల్టు షాపునకు పైసలు అడిగే పరిస్థితి తెచ్చిన్నా? లేదా?’ అంటూ సీఏం సభలో ప్రశ్నించడంతో మహిళలు ఉలిక్కిపడ్డారు. తాము పొద్దంతా కష్టపడి పనిచేసి కూలి డబ్బులు తెస్తే అవి భర్తల తాగుడుకే సరిపోతాయని అర్థం వచ్చేలా మాట్లాడటం చూసి విస్తుపోయారు. గల్లీకో బెల్టు దుకాణం తానే తెచ్చినట్టు రేవంత్ తన వ్యాఖ్యలతో పరోక్షంగా అంగీకరించారని చెప్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా దమనకాండ కొనసాగింది. ఎకడికకడ ఆంక్షలు, అరెస్టు లు, నిర్బంధాల నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది.
తనను కోసినా పైసా లేదని ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు రాష్ర్టాన్ని న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా చేస్తాననడంపై ఆలేరు ప్రజలు విస్మయం వ్యక్తంచేశారు. ఆయుటి చినుకులు పడి, కాలం మోకామీది కొచ్చి రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తుంటే సీఎం టోక్యో, జపాన్ అని చెప్పడంతో రైతులు బిత్తరపోయారు. 18 నెలల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఇప్పుడు పిట్టల దొర హామీలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కాలు విరగడానికి, దేవుళ్లకు ముడిపెట్టడంపైనా ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్లపై ఒట్టు పెట్టి మోసం చేసినందుకే రాష్ర్టానికి అరిష్టం పట్టిందని చెప్తున్నారు.