హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీని, తెలంగాణ సాహితీకారులను రేవంత్‌రెడ్డి సర్కార్ అవమానించిందని సాహితీలోకం ఆవేదన వ్యక్తంచేస్తున్నది. ప్రముఖ సాహితీవేత్త, బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ఈయేడు కాళోజీ పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. దానిని బహూకరించకుండా విస్మరించిందని విమర్శిస్తున్నారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన అవార్డును కాళోజీ జయంతినాడు (సెప్టెంబర్ 9) ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. తొలి అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ నుంచి 2023లో జయరాజ్ వరకు ప్రకటించిన అవార్డులను ప్రతి యేటా కాళోజీ జయంతినాడే సభ నిర్వహించి అందజేశారు. కరోనా సమయంలో (2020) కూడా కేసీఆర్ ఆ ఆనవాయితీని కొనసాగించారు.
కొవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో సభ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఆ సంవత్సరం పురస్కార విజేత, ప్రముఖ సాహితీవేత్త రామాచంద్రమౌళిని ప్రగతిభవన్ (నేటి ప్రజాభవన్)కు పిలిపించి కేసీఆర్ స్వయంగా అవార్డు అందజేసిన సందర్భాన్ని సాహితీవేత్తలు గుర్తుచేస్తున్నారు. ఆ సంప్రదాయానికి సీఎం రేవంత్‌రెడ్డి గండికొట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాళోజీ జయంతినాడు అందించే ఆనవాయితీని తప్పిన ప్రభుత్వం కనీసం కాళోజీ కళాకేంద్రం ప్రారంభోత్సవం రోజైనా అందజేస్తుందని ఆశించారు. మంగళవారం కాళోజీ కళాకేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా నలిమెల భాస్కర్‌కు అవార్డు ప్రదానం చేయకుండానే విస్మరించారు. దీనిపై సాహితీలోకం విస్మయం వ్యక్తంచేస్తున్నది. ఇప్పటికైనా నలిమెల భాస్కర్‌కు అవార్డును ప్రదానం చేయాలని డిమాండ్ చేస్తున్నది.