Ugadi Panchangam హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఈ సంవత్సరం రాజు, మంత్రుల మధ్య ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయని ప్రముఖ పంచాంగ పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో సీఎం, మంత్రుల మధ్య ఆధిపత్యపోరు రుజువుచేసేలా పంచాంగ శ్రవణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఆధిపత్యం కోరుకునేవాళ్లు ఎక్కువవుతారని, అసహనం కలిగినవారికి పరాభవం తప్పదని, పాలకుల మధ్య సయోధ్య ఉండాలని సూచించారు. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు, జనవరి 25 నుంచి జూన్ 26 వరకు గురుచండాల యోగంవల్ల దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు జాగ్రత్తపడాలని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది తుల రాశి అని, భాగ్యంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఆయనకు బాగుంటుందని బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి చెప్పారు. లగ్నంలో రాహువు ప్రభావం ఉంటుందని, ఆరవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శత్రువులపై విజయం సాధించడానికి మరింత బలం కావాలని స్పష్టంచేశారు. అయినా అప్పుడప్పుడు తలనొప్పులు తప్పవని పేర్కొన్నారు.
నూతన సంవత్సరంలోనూ రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు కొనసాగుతాయని సంతోష్‌కుమార్ శాస్త్రి తెలిపారు. ఆర్థిక శాఖను చూసే వారికి ఇది పెద్ద చిక్కేనని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే పాలన బాగుంటుందని చెప్పారు. ఒప్పందాలు, భాగస్వామ్యాలు, ఇతర రాష్ర్టాలతో నీటి పంపకాల వ్యవహారంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు. కేంద్రంతో పోరాడి నిధులు సాధించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
నాయకులు అతిగా మాట్లాడొద్దని, మం చిది కాదని సంతోష్‌కుమార్ శాస్త్రి స్పష్టం చేశా రు. మంచివారిని తిట్టడం, వేదాన్ని నింది ంచడం, బ్రాహ్మణులను, ధర్మాన్ని నిందించడం చేసిన వాళ్లకు పరాభవం తప్పదని హెచ్చరించారు. ఏప్రిల్ 10 నుంచి జులై 4 వరకు కాలసర్పయోగం వల్ల రాష్ర్టాల్లో ప్రశాంతత ఉండదని చెప్పారు. కలెక్టర్లకు, పోలీసులకు నిద్ర ఉండదని పేర్కొన్నారు. న్యాయ స్థానాల జోక్యం ఉంటుందని, కొన్ని చట్టాలపై న్యాయస్థానాల వత్తాసు ఉంటుందని తెలిపారు.
కుజుడు మంత్రి అయ్యాడు కాబట్టి హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్లో అభివృద్ధి కనిపిస్తుందని సంతోష్‌కమార్ శాస్త్రి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా అత్యున్నత స్థాయికి చేరదన్నారు. ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్లు భూములు కొనుగోలు చేయాలే తప్ప.. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయడం మంచిది కాదని చెప్పారు. అన్ని రకాల ధరలు పెరుగుతాయని, ఖర్చులు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. షేర్లలో పెట్టుబడి పెట్టొదని హెచ్చరించారు. వర్షాలకు తిరుగులేదని, పాడిపంటలు, ధరలు బాగున్నాయని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉంటాయని, 50 డిగ్రీలు సాధరణమవుతాయని చెప్పారు.
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి పంచాంగ శ్రవణ సమయంలో పూర్తిగా పరధ్యానంలో ఉన్నట్టు కనిపించింది. మనిషి ఇక్కడ ఉన్నారే తప్ప మనసు మాత్రం ఎక్కడో ఉన్నదన్న చర్చ జరిగింది. ఒకసారి ముభావంగా, మరోసారి నిద్రమత్తుతో ఇబ్బందిపడినట్టు కనిపించారు. మరోవైపు, పవిత్రమైన ఉగాది వేడుకల్లో, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పులతో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం చెప్పులతో కనిపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు, అధికారులంతా చెప్పులు లేకుండా వేదిక మీదకు రాగా, వారిద్దరు మాత్రమే చెప్పులతో వేదికపైకి రావడం గమనార్హం.