వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా వినకుండా గల్లీ మొదలుకొని ఢిల్లీ దాకా ‘తెలంగాణ దివాలా తీసింది.. అప్పుల పాలైంది.. మూలధనం లేదు..’ అంటూ రా ష్ట్రం పరువునూ, ఇటు రుణపరపతిని దెబ్బతీసిన సీఎం రేవంత్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఎక్కడా అప్పు పుట్టట్లేదని బీద అరుపులు మొదలు పెట్టారు. ఇందుకు కారణమూ బీఆర్ఎస్సేనని యథాప్రకారం నిందలువేస్తున్నారు. ‘ఆర్థిక క్యాన్సరు, అబద్ధాలు’ అంటూ రాష్ర్టాన్ని దివాలాగా ముద్రవేసి బజారులో నిలబెట్టడం సరికాదని హితవుచెప్పినా పట్టించుకోని సీఎం ఇప్పుడు ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Revanth Reddy | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి చేరింది. దీంతో ఈ హామీల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బీద అరుపులను మొదలు పెట్టారు. వరుసగా సభల్లో పైసల్లేవు.. తానేం చేయలేననే విధంగా పరోక్ష సంకేతాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలోనూ అదే బీద అరుపులను సీఎం వల్లె వేశారు.
‘ఎక్కడా అప్పు పుడుతలేదు. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి పైసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో 922 మందికి నియామకపత్రాలు అందించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.
‘ఈ రోజుకు 8 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఎట్ల తీసుకొచ్చి ఇయ్యాలా? ఏ అప్పూ పుడుతలేదు మార్కెట్ల.. ఎవ్వడూ మనల్ని నమ్ముతలేడు’ అని పేర్కొన్నారు. ‘రేవంత్ సీఎం అయ్యాక హుందాగా మారలేదు. అట్లనే దూకుడుగా ఉన్నాడు అంటున్నారు. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థ చేసుకొనేవాళ్లు ఉండాలి కదా!’ అని అన్నారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే బిల్డ్ నౌ పోర్టల్‌ను తీసుకొచ్చామని, ఎంతటివారైనా సరే ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే తమ ఉద్దేశమని.. అదే గుడ్ గవర్నెన్స్ అని.. ఇది తెలంగాణ మోడల్ అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే కొందరు బాధపడుతున్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. ‘మిస్ వరల్డ్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము అందాల పోటీలు నిర్వహిస్తుంటే కేటీఆర్ నీ బాధ ఏందిరా నాయినా? పర్యాటక రంగానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శించబోతున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతున్నది. భవిష్యత్‌లో వందల కోట్ల ఆదాయం రాబోతుంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఫార్ములా- ఈ రేస్ ముసుగులో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారన్నారని ఆరోపించారు. అయితే ఫార్ములా-ఈ రేసు కూడా సీఎం చెప్పినట్టుగా రాష్ట్ర పర్యాటకానికి, పెట్టుబడులకు ఉపయోగపడుతుందని నాటి ప్రభుత్వం చెప్పినప్పుడు అప్పుడు ఎందుకు వ్యతిరేకించారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ అందాల పోటీలతో తెలంగాణ వైపు ప్రపంచం చూస్తుంటే.. నాడు ఫార్ములా-ఈ రేసుతో సైతం ప్రపంచం తెలంగాణ వైపు చూసింది కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ప్రపంచ అందాల పోటీ నిర్వహణలో లేని తప్పు ఫార్ములా రేసు నిర్వహణలో ఎందుకొచ్చిందని నిలదీస్తున్నారు.
వాళ్లకు టీటీడీ ఉంటే.. మనకు వైటీడీఏ(యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) ఉన్నదని, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నామని సీఎం చెప్పారు. ప్రతిసారి దర్శనాల కోసం వాళ్లను మనం అడుక్కోవడం ఎందుకు.. మనకు గుడులు లేవా? అని పేర్కొన్నారు. అయితే యాదాద్రిని తిరుపతితో పోల్చుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. యాదాద్రిని నాటి సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసిన విషయాన్ని మాత్రం దాచేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో దేవాలయాన్ని పునర్నిర్మించారు కాబట్టే.. నేడు ఆ గుడిని తిరుపతితో పోల్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘ధర్నాచౌక్‌లో ధర్నాలు చేయడానికి మా ప్రభుత్వం అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు..’ అని వాపోయారు.
‘ప్రజలు తమపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకు నాపై కోపంగా ఉన్నారా? అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకు నాపై కోపం ఉంటుందా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకా? పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఎందుకు మాపై కోపంగా ఉంటారు?’ అని ప్రశ్నించారు.
నిన్న మొన్నటి వరకు తమ ప్రభుత్వం 57 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకొన్న సీఎం గురువారం ఇందులో కొంత వాస్తవాన్ని అంగీకరించారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని నోటిఫికేషన్లు తామే ఇచ్చామని చెప్పడం లేదని, గత ప్రభుత్వంలో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారని, కొన్నింటికి పరీక్షలు నిర్వహించారని చెప్పారు. తద్వారా మెజార్టీ ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పూర్తయిందని ఆయన అంగీకరించారు.