CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్7 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గాన్ని వదిలి, హెలికాప్టర్లో పాదయాత్రకు సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరి భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శించే విధంగా రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. పాదయాత్ర మార్గమధ్యంలో ఆయనకు ఎవరెవరు వంగి దండాలు పెట్టాలి, మెడలో ఎవరు దండలు వేయాలి, హారతులు ఎవరు పట్టాలి, పార్టీ కార్యకర్తల గుంపులు ఎక్కడెక్కడ నిలబడి జై కొట్టాలి.. అనే అంశాలపై ముందస్తుగానే పకడ్బందీ ప్లాన్ చేశారు. ఎంపిక చేసిన రైతులు మాత్రమే ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వీలుగా సమావేశ స్థలాన్ని సిద్ధంచేసి పెట్టినట్టు తెలసింది. రైతు సమావేశంలో సీఎంను ఏఏ ప్రశ్నలు అడగాలనే దాని మీద ఓ ఎంపీ సమక్షంలో ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. పతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడానికి మూసీ పరీవాహక ప్రాంతం వెంట పాదయాత్ర చేస్తానని తొలుత సీఎం రెవంత్‌రెడ్డి ప్రకటించారు.
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని అదేరోజున మూసీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తానని తొలుత ప్రకటించారు. సంగెం గ్రామం నుంచి మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే మూడు రోజులు చేస్తానన్న పాదయాత్ర.. ప్రజా వ్యతిరేకత కారణంగా ఒక్కరోజుకే కుదించి మొక్కుబడిగా చేపడుతున్నట్టు అర్థమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సంగెం నుంచి మూసీ నది కుడి ఒడ్డు నుంచి యాత్ర ప్రారంభమై, భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల వరకే పాదయాత్ర కొనసాగుతుందని, అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర కొనసాగిస్తారని నిర్వాహకులు ప్రకటించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఓఆర్ఆర్ మీదుగా వరంగల్ హైవేపై ప్రయాణించి ఉదయం 8.30లోపు దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయాలని అనుకున్నారు. కానీ ఆకస్మికంగా ఈరోడ్డు మార్గాన్ని రద్దుచేశారు. ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి యాదాద్రి ఆలయాన్ని చేరకుంటారని అధికారులు ప్రకటించారు. హైవేను వదిలి స్కైవేలో ప్రయాణించడానికి బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తున్నది.
సీఎం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే.. రైతులు, మూసీ, హైడ్రా బాధితులు అడ్డగించి నిరసనలు తెలిపే ప్రమాదం ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికీ రూ.2 లక్షల రుణమాఫీ కాని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, మార్కెట్లతో ధాన్యం కొనుగోళ్లు కాక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు సీఎం పాదయాత్ర నల్లగొండ వైపు మూసీ దిక్కు నుంచి కాకుండా హైదరాబాద్‌లో ఉన్న మూసీ వైపు పాదయాత్ర చేయాలని, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొంపగూడు కోల్పోయిన బాధితులు అక్కడ పెట్టుకొని నల్లగొండ నుంచి పాదయాత్ర చేయడం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని వారంటున్నారు.
సీఎం పర్యటిస్తున్న మూసీ ప్రాంతంలోని రైతులు గురువారం పర్యటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ‘ముఖ్యమంత్రీ నువు రాకున్నా ఫర్యాలేదు.. కానీ, రుణమాఫీ చెయ్యి’ అంటూ పలుచోట్ల ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో రైతాంగం, మూసీ బాధితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి సీఎం ప్రయాణానికి అడ్డంపడి నిరసన తెలిపే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ నివేదిక అందడంతో పోలీస్ అధికారులు, కాంగ్రెస్ నేతలు జాగ్రత్తపడ్డారని తెలుస్తున్నది. సీఎం పాదయాత్ర సాగేమార్గంలో అనుమానిత రైతులను, రైతు సంఘాల, బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ంధు రాలేదు.. నువ్వు రాకున్నా పర్లేదు
వలిగొండ, నవంబర్ 7 : ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు రాకున్నా పర్వాలేదు’ అంటూ రైతులు నిరసన తెలిపారు. ‘మూసీతో మురిపించకు.. రుణమాఫీతో కరుణించు, రైతు బంధు రాలేదు.. నువ్వు రాకున్నా పర్లేదు’ అని ముద్రించిన పోస్టర్లతో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల్లో గురువారం నిరసన తెలిపారు.
యాదాద్రి జిల్లా సంగెం గ్రామానికి చెందిన రైతులు రేవంత్ మూసీ పాదయాత్రపై నిరసనకు దిగారు. రైతుబంధు ఇవ్వని, రుణమాఫీ చేయని సీఎం మా వద్దకు రావద్దంటూ పోస్టర్లు ప్రదర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత కసి, కోపం ఉన్నదో మరోసారి బట్టబయలైంది. వాస్తవానికి ఇదే పర్యటనలో ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పైలాన్‌ను కూడా ఆవిష్కరించాల్సి ఉన్నది. ఇది యాదాద్రి భువనరిగి జిల్లాలో భాగంగా 550 గ్రామాలకు మంచినీటిని అందించే పథకం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి అన్ని అనుమతులు ఇచ్చారు. సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల దాహార్తిని తీర్చే పథకం ఇది. మల్లన్నసాగర్‌కు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసు పెంచుకున్నది. మళ్లీ ఇక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి గ్రామాలకు తాగునీటిని అందిస్తే ప్రజల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద సానుకూల ప్రభావం, కేసీఆర్ పట్ల ఆరాధనా భావం ఏర్పడుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఆఖరి నిమిషంలో పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.