Government Schools | దరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడులు విద్యార్థుల్లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొత్తగా చేరేవారు లేక.. చేరిన వారు కొనసాగక వెలవెలబోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో 1,346 స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య జీరో. పూర్తిగా సున్నా విద్యార్థులున్న స్కూళ్లల్లో 1,265 ప్రాథమిక పాఠశాలలు కాగా.. 20కిపైగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఈ జాబితాలో ఉన్నాయి. విద్యార్థులున్నా.. లేకున్నా ఈ స్కూళ్లను నడిపించాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. మూసివేసిన స్కూళ్లను తెరిపించాలని శనివారం నాటి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి.
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీచేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను తెరిస్తేనే మెగా డీఎస్సీ సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. సున్నా విద్యార్థులున్నవి 1,346 స్కూళ్లుంటే.. సున్నా నుంచి 10లోపు విద్యార్థులున్న స్కూళ్లు మొత్తంగా 2,842 ఉన్నాయి. వీటికి విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక టీచర్ సరిపోతారు. కానీ ఖాళీలను చూపించేందుకు విద్యార్థుల్లేకున్నా ఈ స్కూళ్లను తెరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ స్కూళ్లను తెరిపించే ఆలోచన బాగానే ఉన్నా.. విద్యార్థులొచ్చేలా… అడ్మిషన్లు పెరిగేలా స్కూళ్లను బలోపేతం చేయాలని విద్యారంగ నిపుణుల సూచిస్తున్నారు. అప్పుడే బడుల ఆశయం నెరవేరుతుందని అంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గతంలో విలీనం చేసిన స్కూళ్లను తెరుస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషనలైజేషన్‌లో భాగంగా 2016లో స్కూళ్ల విలీనం పేరుతో 6వేల స్కూళ్లను ఇతర స్కూళ్లలో కలిపారు. ఇవి పూర్తిగా ఒకే ప్రాంగణంలోనివి. ఒకే ఆవరణలో నడుస్తున్న ఈ స్కూళ్లను అప్పట్లో అదే ప్రాంగణంలోని మరో స్కూళ్లల్లో విలీనం చేశారు. రెండు ప్రాథమిక పాఠశాలలుంటే ఒకటిగా, ఒక ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉంటే ఒక ప్రాథమికోన్నత పాఠశాలగా మార్పుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌తో ఈ భర్తీ ప్రక్రియకు అంతరాయం కలిగింది. అయితే, 9,370 టీచర్ పోస్టుల భర్తీకి గతంలోనే ఆర్థికశాఖ ఆమోదం తెలుపగా.. 5,089 పోస్టులను మినహాయిస్తే మరో 4 వేల పోస్టులు మా త్రమే ఖాళీలున్నా యి. టీచర్ల పదోన్నతులు పూర్తయితే మరో 8వేల పోస్టులు ఖాళీ అవుతాయి. కానీ ఈ చిక్కుముడి ఇప్పట్లో వీడే అవకాశం కనిపించడం లేదు.