హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు.
రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని తెలిపారు.
పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఆదివారం సమావేశమైన సంఘం నేతలు పత్తి కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీసీఐ సీఎండీకి లేఖ రాశాయి. పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నాయి. ఈ సీజన్లో తెలంగాణలో రైతుల నుంచి పత్తి కొనుగోలుపై సీసీఐ ఎన్నడూ లేని విధంగా కొర్రీలు పెడుతున్నది.
రెండు రోజుల క్రితం సీసీఐ తీసుకున్న నిర్ణయం ఇటు మిల్లులకు, అటు రైతులకు శరాఘాతంగా మారింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 318 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేది. కానీ శనివారం నుంచి సీసీఐ ఈ విధానాన్ని ఎత్తేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక జిల్లాలోని మిల్లులకు ఎల్1, ఎల్2, ఎల్3.. ఇలా క్రమసంఖ్యను కేటాయిస్తుంది. క్లస్టర్ల వారీగా విభజించి మొదటి మిల్లులో సామర్థ్యం మేరకు కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే మరో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తుంది. అప్పటి వరకు మిగిలిన మి ల్లుల్లో ఎలాంటి కొనుగోళ్లు ఉండవు.
సీసీఐ పత్తి కొనుగోలులో ఇష్టారీతిగా కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్ శాఖ చేష్టలుడిగి చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సచివాలయానికి, మార్కెటింగ్ శాఖకు తిరగడానికే సరిపోతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోలులో రైతుల ఇబ్బందులు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి సీసీఐ అధికారులను కలిసి తేమ శాతం సడలింపుపై, కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల తొలగింపుపై ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.