హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా మెంబర్స్ క్లబ్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. శాసనసభ, పాత మండలి భవనాల వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం జరుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సభ్యుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శాసనసభ ప్రాంగణంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. గతంలో నిర్ణయించిన మేరకు పార్లమెంట్ తరహాలో సభ్యులకు సెంట్రల్ హాలును వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.