హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ‘ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేశాం. మీ సమస్యలు విని చట్టసభల్లో ప్రస్తావిస్తారనే పంపించాం. కానీ, కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్టేయించిండ్రు. ఇదేం పైశాచిక ఆనందం. మళ్లీ కోదండరాం సార్‌కు ఎమ్మెల్సీ ఇస్తాం. సర్‌ను 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీగా పంపుతాం. ఎవడు అడ్డువస్తాడో చూద్దాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడారు. సోమవారం ఓయూలో పలు ప్రారంభోత్సవాలకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టేలా మరోసారి మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇటీవలే కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు కుట్రతో కోదండరాం ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసిందనే అర్థం వచ్చేలా సీఎం మాట్లాడారు. అలాగే, కంచ గచ్చిబౌలి భూముల గురించి కూడా ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారని, తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవని సీఎం పేర్కొన్నారు. వాస్తవానికి, సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సాధికార కమిటీ స్వయంగా కంచ గచ్చిబౌలికి వచ్చి అక్కడి భూముల్లో ఉన్న జంతుజాలాన్ని, వృక్షాలను స్వయంగా చూసి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ కేసును స్వయంగా వింటున్నారు. అలాంటిది మరోసారి సుప్రీంకోర్టును తక్కువ చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
వీసీని ఏకవచనంతో సంబోధించిన సీఎం
ఇక యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కుమార్‌ను పలు సందర్భాల్లో ఏక వచనంతోనే సీఎం రేవంత్‌రెడ్డి సంబోధించారు. తాను సీఎం అయ్యాక దళితుడు వీసీగా ఉండాలని భావించానని చెప్తూ పదే పదే కుమార్ పేరును ప్రస్తావించారు. తాము కుమార్‌ను ఓయూ వీసీని చేశామని ఏకవచనంతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం పట్ల విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి దొరతనం స్వభావం బయటపడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఉస్మానియా భూములను ప్లాట్లు చేసుకుని అమ్ముకుంటారని చెప్పడంపై కూడా విద్యార్థులు వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు. గచ్చిబౌలి భూములను ప్లాట్లు చేసి అమ్ముకునేందుకో ప్రయత్నించింది ఎవరో మాకు తెలియదా? అంటూ చురకలేశారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు అని అందరికీ తెలుసు కానీ, ఆయన మాట్లాడాల్సింది కుక్కలు పట్టి పీక్కుతిన్న జింకల గురించి అని, బయటికి వచ్చిన జింకలను, నెమళ్లను వదిలేసి ఏనుగులు, సింహాలు అనడం సమస్యను తప్పుతోవపట్టించడమేనని విద్యార్థులు అంటున్నారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసేందుకు తామంతా బస్సులు వేసుకుని రాష్ట్రం మొత్తం తిరిగామని, ఆయనకు ముఖ్యమంత్రి ఉద్యోగం ఇప్పించాం కానీ, తమకు జాబ్ క్యాలెండర్ ఏదని విద్యార్థులు అడుగుతున్నారు. 60 వేల ఉద్యోగాలు సీఎం రేవంత్‌రెడ్డి సృష్టించినవి కావని, గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలనే తాను ఇచ్చినట్టుగా ప్రకటించుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి.
మళ్లోసారి వస్త్తడంట
బందోబస్తు లేకుండా మళ్లీ ఒకసారి యూనివర్సిటీకి వస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై విద్యార్థులు స్పందిస్తూ.. ఇప్పుడెందుకు కర్ఫ్యూ పెట్టుకొని వచ్చావంటూ మాట్లాడుకోవడం కనిపించింది. యూనివర్సిటీ చుట్టూ కంచెలు పెట్టుకొని, పోలీసు పహారాలో వచ్చి తమకు సుద్దులు చెప్పడం ఎందుకు? అని సీఎం ప్రసంగం సాగిన తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
ఓయూను ఆక్స్ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతాం
‘నా దగ్గర పంచడానికి భూములు లేవు.. ఖజానా లేదు.. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే.. మీ తలరాతలు మార్చేది చదువు ఒక్కటే.. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతాం.. మళ్లీ యూనివర్సిటీకి వస్తా.. ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తా.. పోలీసులకు నేను ఆదేశిస్తున్నా.. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దు.. నిరసన తెలిపేవారిని నిరసన తెలపనివ్వండి.. నేను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక యూనివర్సిటీలోనూ రాజకీయ ప్రసంగాలే చేశారు. సామాజిక చైతన్యం ఉండాలని చెప్తూ.. అద్దంకి దయాకర్ ప్రజా ఉద్యమాల్లో పనిచేశారని, 10-12 ఏండ్లపాటు ఆయనకు ఏ పదవీ రాకుండా కొంతమంది అడ్డుకున్నారని చెప్పారు. వాస్తవానికి, అద్దంకి దయాకర్‌ను అడ్డుకున్నది నల్లగొండ జిల్లాకే చెందిన ప్రస్తుత రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈ విషయం జగద్వితం. సీఎం తరచూ మంత్రి వెంకట్‌రెడ్డిపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా యూనివర్సిటీలో కూడా అద్దంకి దయాకర్ అంశాన్ని ప్రస్తావించే సందర్భమే లేకపోయినప్పటికీ, ఆయన పేరు తీసుకొని మాట్లాడారు.