హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారి దగ్గర సమస్యను పరిష్కరించే శక్తి ఉన్నా కూడా.. వారే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సోమవారం ట్యాంక్‌బండ్‌లోని అమరవీరుల స్థూపం సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన పాపన్నగౌడ్ 375వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లు ఐదు నెలలైనా రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందకుండా ఉన్నదని, ఈ ఆలస్యం వెనుక మోదీ, కిషన్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు ప్రతిక్షణం అడ్డం పడుతున్న వారే.. తొండి వాదన, మొండివాదన చేస్తున్నారని దుయ్యబట్టారు.
చదువుకున్నవారు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నవారు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చేశారంటూ వితండవాదన చేస్తున్నారని మండిపడ్డారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది చట్టంలోనే లేదని, అలా చేస్తే.. రెండు నిమిషాల్లోనే సుప్రీంకోర్టు దానిని కొట్టివేస్తుందని చెప్పారు. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని సీఎం కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, గౌడ సంఘాల నేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు
సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించారు. జిల్లాల్లోనూ కలెక్టరేట్లలో నిర్వహించారు. బీసీ కుల సంఘాలు, గౌడ సంఘాల ఆధ్వర్యంలోనూ, బీఆర్ఎస్తోపాటు పలు పార్టీల ఆధ్వర్యంలోనూ జయంతి కార్యక్రమాలు కొనసాగాయి. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.