Kodangal | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్‌లో ఆర్అండ్బీ శాఖ నిర్మించ తలపెట్టిన గె స్ట్హౌస్.. కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసింది. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను ఓ కాంగ్రెస్ నాయకుడికి చెందిన ప్రైవేట్ స్థలంలో నిర్మిస్తుండటమే ఇందుకు కారణమైంది. భూసేకరణ పూర్తికాకుండానే ప్రైవేట్ స్థలంలో ఆర్అండ్బీ శాఖ గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టడం విమర్శలకు దారితీసింది. తన పట్టాభూమిలో గెస్ట్‌హౌస్ ఎలా కడతారని సదరు నాయకుడు ఇప్పటికే సీఎం కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
కొడంగల్‌లో ఇప్పటికే ఓ పురాతన ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఉన్నది. ఎవరైనా అధికారులు, వీఐపీలు వచ్చినప్పుడు అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ వీఐపీల రాక లేనందున ఇక్కడి అవసరాలకు గెస్ట్‌హౌస్ సరిపోతున్న ది. కాగా, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ సువిశాల గెస్ట్‌హౌస్ నిర్మించాలని నిర్ణయించారు. దీనిని రూ.6.8 కోట్లతో నిర్మిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకుడికి చెందిన ప్రైవేట్ స్థలంలో గెస్ట్‌హౌస్ నిర్మిస్తుండడం పార్టీలో వివాదానికి దారితీసింది. తనకు సమాచారం ఇవ్వకుండా, తనతో సంప్రదించకుండానే తన స్థలంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఎలా నిర్మిస్తున్నారని సదరు నాయకుడు హైకమాండ్‌పై గుర్రుగా ఉన్నట్టు పార్టీ కార్యకర్తల్లో చర్చ నడుస్తున్నది. ఈ విషయమై ఆయన ఇటీవలే సీఎంకు ఫిర్యాదు చేయగా, తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు, గెస్ట్‌హౌస్ భూమిపూ జ కార్యక్రమంలో సీఎం సోదరుడు ప్రముఖం గా పాల్గొనడంతో సీఎం సూచనల మేరకే ఇది నిర్మిస్తున్నారనే చర్చ నడుస్తున్నది.
నారాయణపేటలో నిర్మించాలని ప్రతిపాదించిన గెస్ట్‌హౌస్‌ను కొడంగల్‌కు మార్చారని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. గతంలో నారాయణపేట్‌లో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు కాగా ప్రభుత్వం మారడంతో కార్యరూపం దాల్చలేదు. కొడంగల్‌లో ఇదివరకే ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఉండటంతో నారాయణపేటలో నిర్మించాలని గతం లో ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ ప్రతిపాదన ను రద్దుచేసి కొడంగల్‌లో నిర్మిస్తుండటం గమనార్హం. గెస్ట్‌హౌస్ లేనిచోట కట్టాల్సిందిపోయి ఉన్నచోటే మరో గెస్ట్‌హౌస్ కడుతుండటం వి మర్శలకు తావిస్తున్నది. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతోపాటు సీఎం సోదరుడు కార్యక్రమంలో పాల్గొనగా, కాంగ్రెస్ నేత ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా సీఎం సోదరుడు ఎలా పాల్గొంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గెస్ట్‌హౌస్ భూమి విషయంలో చర్చలు జరుగుతున్నాయని, సమస్య పరిష్కారమవుతుందని, నిర్మాణానికి ఢోకా లేదని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ గెస్ట్‌హౌస్ ప్రభుత్వ స్థలంలోనే చేపట్టాలి. ఒకవేళ ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన తరువాత నిర్మించాలి. కానీ, భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే ఆర్అండ్బీ అధికారులు ప్రైవేట్ స్థలంలో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి పూనుకోవడం వివాదాస్పదమైంది. సదరు భూమి కాంగ్రెస్ నాయకుడికి చెందినదని, ఒకవేళ భూ బదలాయింపు జరగకపోతే నిర్మాణం కో సం చేస్తున్న ఖర్చు వృథా అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.