Harish Rao | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిన మరుక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి తనకుండే అధికారాన్ని ఉపయోగించి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఒక అంశంపై చర్చ జరుగుతుంటే ఆ అంశానికి సంబంధంలేని అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఒక కాగితం పట్టుకొని చదువుతూ సభను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చర్చల సందర్భంగా సీఎం లేఖలను చూపుతూ, వాటిలోని విషయం మొత్తాన్ని చదవకుండా తనకు అనుకూలమైన అంశాలను మాత్రమే చదువుతూ అసలు విషయాలు దాచిపెడుతున్నారని మండిపడ్డారు. సభా నాయకుడిగా పదిమందికీ ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రే మూడు అంశాల్లో సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎంపై తాము వాయిదా తీర్మానం, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసు ఇస్తామని తెలిపారు.
1) సాగునీటి అంశంపై చర్చ జరుగుతుండగా ‘రిటైర్డ్ ఇంజినీర్లు సూచించిన లేఖ ఇది’ అంటూ అందులోని అనుకూలమైన అంశాన్ని మాత్రమే సీఎం చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్‌గా మిడ్‌మానేరుకు నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు, మధ్యలో ఎన్టీపీసీ ఉన్నది, బొగ్గుబావులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ వైర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి నేరుగా మిడ్‌మానేరు దాకా తీసుకుపోవడం సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారని తెలిపారు. దీనిని వదిలేసి ‘అసలు మేడిగడ్డే ఫీజిబుల్ కాదు’ అని రిటైర్డ్ ఇంజనీర్లు అన్నారంటూ సభను సీఎం తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. నేరుగా మేడిగడ్డ నుంచి నీళ్లను లిఫ్ట్ చేయటం సాధ్యం కాదన్నారు కాబట్టే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కట్టి నీటిని ఎల్లంపల్లికి తెచ్చినట్టు వివరించారు.
2) విద్యుత్తు అంశంపై చర్చ సందర్భంగా కరోనాతో నష్టం, ఉదయ్ పథకం, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు వంటి కారణాల వల్ల రూ.41వేల కోట్ల అప్పులు రాష్ట్రంపై పడ్డాయని సభ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. ఈ క్రమంలో వ్యవసాయ బోర్లకు, బావులకు మీటర్లు పెడితే కర్ణాటక, ఏపీ మాదిరిగా కేంద్రం నుంచి అదనంగా తెలంగాణకు రూ.30 వేల కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం ఉండేదని, కానీ తాము ప్రజలు, రైతుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని వదులుకున్నట్టు తెలిపారు. ఈ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని ‘మీరు మోటర్లకు మీటర్లు పెడ్తామని ఒప్పందం చేసుకున్నారు’ అంటూ అధికారుల పేర్లు పదే పదే చదివారని తెలిపారు. కానీ అదే లేఖలోని ‘అదర్ దేన్ అగ్రికల్చర్ కనెక్షన్స్’ (వ్యవసాయేతర కనెక్షన్లు) అన్న పదాలను వదిలేశారని మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు ఒక పేరాగ్రాఫ్‌లో రెండు పదాలను ఎగరగొట్టొచ్చా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే సభను తప్పుదారి పట్టిస్తే శాసనసభకు విలువ ఉంటదా? అని ప్రశ్నించారు. పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టాలని, వ్యవసాయేతర కనెక్షన్లకు అని స్పష్టంగా ఉదయ్ ఒప్పందంలో ఉన్నదన్నారు. దాన్ని వదిలేసి మోదీతో కేసీఆర్ కలిసిపోయాడంటూ పేర్కొనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
3) బీఆర్ఎస్ మంత్రులుగా ఉన్న సమయంలో నాయిని నర్సింహారెడ్డి ఇన్చార్జిగా ఉండి, దగ్గరుండి పోతిరెడ్డిపాడును ప్రారంభించారంటూ సభను సీఎం మరోసారి తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పొక్క పెట్టించారని సీఎం పేర్కొనడాన్ని ఖండించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ వంటి నాయకులే పదవుల కోసం పెదవులు మూశారని దుయ్యబట్టారు. జూలై 4, 2005వ తేదీన తాము ఆరుగురు మంత్రులం రాజీనామా చేసినట్టు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ పవిత్రను కాపాడడం, పులిచింతల, తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు, 610 జీవో అమలు చేయకపోవడం వంటి అంశాలపైనా తాము మంత్రిపదవులకు రాజీనామా చేశామని వివరించారు. 2005 డిసెంబర్ 19న పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని తెలిపారు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రుణమాఫీపై మొదట్లో రూ. 41వేల కోట్లు అని, తరువాత రూ. 39వేల కోట్లు అని ఆ తరువాత రూ.. 31వేల కోట్లు అని చెప్పి తీరా బడ్జెట్లో రూ. 25వేల కోట్లే ప్రతిపాదించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ 2004లో బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్నప్పుడే రాష్ట్రం ఇస్తే ఆత్మబలిదానాలు జరిగేవి కాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. డిసెంబర్ 9 ప్రకటనను డిసెంబర్ 23న వెనక్కి తీసుకున్న సమయంలో ‘ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి’ అని తెలంగాణ ప్రజలు ఆదేశిస్తే తాము రాజీనామా చేసినట్టు చెప్పారు. అప్పుడు టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు జిరాక్స్ కాగితాలపై రాజీనామా చేశారని, రేవంత్‌రెడ్డి కనీసం ఆ జిరాక్స్ కూడా ఇవ్వలేదన్నారు. ఆయన ఉద్యమనాయకుడినని చెప్పుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నదని ఎద్దేవా చేశారు. నాడు ‘జై తెలంగాణ’ అంటే తుపాకీతో కాల్చేస్తానన్నట్టుగా వ్యవహరించడం వల్లే ఆయనకు రైఫిల్‌రెడ్డి అని పేరొచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ పీసీపీ ప్రెసిడెంట్ అయ్యేవారా? ఇవ్వాళ సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడకుంటే రేవంత్ ఇంకా టీడీపీలో చంద్రబాబు చేతికిందే ఉండేవారని హరీశ్‌రావు విమర్శించారు.
ఒకే టర్మ్‌లో రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిన చరిత్ర కేసీఆర్‌దని హరీశ్‌రావు చెప్పారు. కేంద్రమంత్రి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే ఇలా అనేకసార్లు తన పదవులను రాజీనామా చేసిన ఉదంతాలను ఆయన వివరించారు. కేసీఆర్ చేసిననన్ని రాజీనామాలు ఎవరు చేశారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కనీసం ఒక్కసారి రాజీనామా చేయటమే కాదు కనీసం జై తెలంగాణ అన్నారా? అని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ ఎంపీ సీటు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓడిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మల్కాజిగిరిలోక్సభ స్థానంతోపాటు, ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లోనూ మెజారిటీ తగ్గిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీని అర్థం ముఖ్యమంత్రి పనితీరు బాగాలేనట్టేనా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందని పేర్కొనటం కాంగ్రెస్ నేతల భావదారిద్రానికి నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 18 రాష్ర్టాల్లో ఒక్క ఎంపీ సీటు గెలవలేదని అంటే ఆ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా? అని ప్రశ్నించారు. బీఆర్ఎ స్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు.
జైపాల్‌రెడ్డి పెద్ద తెలంగాణ వాది. తాను చిన్న తెలంగాణ వాది అన్నట్టు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణకు అనుకూలంగా కేసీఆర్ 36 రాజకీయ పార్టీల నుంచి లేఖలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలంగాణకు అనుకూలంగా జైపాల్‌రెడ్డి ఏ పార్టీ నుంచి లేఖ తెచ్చారని ప్రశ్నించారు.
ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు నాడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.