హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ -2, మూసీ రివర్ ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందేలా చూడాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఏడు నవోదయల కేటాయింపుపై ధన్యవాదాలు తెలిపారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని నితిన్ గడ్కరీని సీఎం కోరారు. సీఎం వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, సురేశ్ షెట్కార్, మల్లు రవి, కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి ఉన్నారు.