హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్‌లో మెట్రోరైల్ ఫేజ్-2కు అనుమతులు, కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు, రీజినల్ రింగ్‌రోడ్డుకు అవసరమైన నిధులు, కేంద్ర క్యాబినేట్ ఆమోదంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో శనివారం జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, అనంతరం ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలుసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఫేజ్-2 ప్రతిపాదనలు పంపామని, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ వ్యక్తం చేసిన అనుమానాలను కూడా నివృత్తి చేశామని, దీని మీద కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.4,230 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. ప్రాంతీయ రింగ్‌రోడ్డుకు 2022లో ఉత్తర భాగంలో భూసేకరణ ప్రారంభమైందని, ఇందులో 50 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని తెలిపారు. ఎన్హెచ్ఏఐ టెండర్లు కూడా పిలిచిందని, ఈ భాగానికి అవసరమైన ఆర్థిక సహాయకంతోపాటు, క్యాబినెట్ ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేశారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ -ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్నరక్షణరంగ ప్రాజెక్టులకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి మరో 800 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించాలని కోరారు. అంతకుముందు నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 2047 నాటికి భారత దేశాన్ని సూపర్ పవర్‌గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు సీఎం తెలిపారు. దేశవ్యాప్త కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు, కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.