CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పని చేయాల్సి ఉంటుందని, దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికైనా ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఇష్టం లేకుంటే, ఎకువ పనిచేయాల్సిన ఈ బాధ్యత తమకు ఎందుకు? అనిపిస్తే నిరభ్యంతరంగా చెప్పాలని, వారిని బదిలీ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీల అమలు బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులదేనని చెప్పారు. ప్రజా పాలన కార్యక్రమం అమలుపై ఆదివారం సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామసభల ద్వారా నిస్సహాయులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనికి అధికారులే వారధిగా ఉండాలని చెప్పారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభలను నిర్వహిస్తున్నామని, ఇందుకు సంపూర్ణమైన సహకారం ఉండాలని కలెక్టర్లకు సూచించారు. పకడ్బందీగా సమాచారాన్నిసేకరించి, డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూటినీ చేసి అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అయితే పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.
నియోజకవర్గానికో స్పెషల్ ఆఫీసర్
రెవెన్యూశాఖ గ్రామ సభలను నిర్వహిస్తుందని, పోలీసు శాఖ వీటిని పర్యవేక్షించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. అధికారుల బృందంలో ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకుంటారని వివరించారు. ప్రజా పాలన కోసం నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని వెల్లడించారు. ప్రతి అధికారి ప్రతి రోజు రెండు గ్రామాలకు వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలని, పోలీసుశాఖతో పాటు స్పెషల్ ఆఫీసర్ స్థానికంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అధికారులు ముందుగానే గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని, మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించారు.
గందరగోళం లేకుండా చూడాలి
ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి? వీటిని ఏ రకంగా అమలు చేయబోతున్నామనే విషయాలతో నోట్ పంపిస్తామని సీఎం తెలిపారు. గ్రామసభ మొదలుపెట్టే ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాతే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు నింపడంలో అంగన్వాడీ, ఆశావరర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామసభల్లో దరఖాస్తులు అందిస్తే గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంటుందని, అందుకే ముందే గ్రామానికి అప్లికేషన్లు పంపించాలని అన్నారు. గ్రామ కార్యదర్శులు, ఇతర వ్యవస్థలతో ముందుగానే అప్లికేషన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఫలితంగా ప్రజలు ముందే దరఖాస్తులు నింపి సభలకు తీసుకుని వస్తారని తెలిపారు. గ్రామసభల్లోనే దరఖాస్తులు పంపిణీ చేస్తే గందరగోళం ఏర్పడి పోలీసులు జోక్యం చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన జాగ్రత్తలపై ప్రజలకు చాటింపు వేసి తెలియజేయాలని సూచించారు.
నకిలీ విత్తనాలపై కొరడా
నకిలీ విత్తనాల సరఫరా ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనదని సీఎం అభిప్రాయపడ్డారు. రౌడీషీటర్ల కోసం ఒక యూనిట్ కింద డాటాబేస్ తయారు చేసినట్టే, నకిలీ విత్తనాలు విక్రయించేవారి డాటాబేస్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ ఓనర్లను బాధ్యులను చేస్తేనే నకిలీ విత్తనాలు తగ్గుతాయని, రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తనాల కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేయాలని ఆదేశించారు. విత్తన చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాలని పేర్కొన్నారు.
బుక్ మై షోపై విచారణ
ఫ్రెండ్లీ పోలీసింగ్ పౌరుడితో ఉండాలి కానీ, క్రిమినల్స్‌తో కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. భూ కబ్జాదారులు, నేరగాళ్లు, డ్రగ్స్ మాఫియాతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తే ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం చిన్న పట్టణాల్లోనూ డ్రగ్స్ దొరుకుతున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. నారోటిక్ బ్యూరో అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదని అన్నారు. డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని, ఎంత పెద్దవాళ్లయినా, ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా ఎవ్వరినీ ఉపేక్షించొద్దని తేల్చి చెప్పారు. బుక్ మై షో లాంటి వారు ప్రభుత్వ అనుమతి పొందకుండానే డిసెంబర్ 31 రాత్రి సన్ బర్న్ పార్టీకి సంబంధించి టికెట్లు అమ్ముతున్నారని, ఆ ప్లాట్‌ఫాంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.